తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పరకాలలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తాత మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి ఉంచాడు. దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లా పరకాలకు చెందిన 23 ఏళ్ల నిఖిల్ అనే యువకుడి తాత అనారోగ్య సమస్యల కారణంగా గత 3 రోజుల కిందట మృతి చెందాడు. అయితే అతని మృతదేహాన్ని నిఖిల్ ఫ్రిజ్ లో దాచి ఉంచాడు. మూడు రోజుల పాటు అలా ఉన్నాక దుర్వాసన వస్తుండడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిఖిల్ తాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని మార్చురీకి తరలించారు.
అయితే తన వద్ద డబ్బులు లేనందునే తన తాత అంత్యక్రియలు చేయలేదని, అందుకనే డెడ్ బాడీని ఫ్రిజ్ లో దాచి ఉంచానని నిఖిల్ పోలీసుల విచారణలో తెలిపాడు. కాగా అతని తాతకు పెన్షన్ వస్తుండేది. దానిపైనే ఇద్దరూ జీవించే వారు. సడెన్ గా నిఖిల్ తాత చనిపోవడంతో తనకు ఇక ఖర్చులకు ఉండవని భావించిన నిఖిల్ కావాలనే తన తాత మృతదేహాన్ని దాచి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.