అమ్మాయిల రక్షణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఎన్నో చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ మహిళలపై, అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ ఈ విధమైన వార్తలను చదువుతూనే ఉన్నాం. అత్యాచారాలకు కొందరు బలవుతుండగా.. మరికొందరు ఆ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటూ చనిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో ఓ వ్యక్తి తమ సమీప బంధువు ఇంటికి తరచూ వెళ్తూ ఆ కుటుంబంలో ఉన్న 17 సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని సదరు బాలిక బయటకు చెప్పలేదు. అయితే ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ కావడంతో అసలు విషయం ఇంటా బయట తెలిసింది. దీంతొ ఎంతో అవమానంగా భావించింది.
ఈ క్రమంలో అవమానాన్ని తట్టుకోలేక ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సదరు యువతిపై అత్యాచారం చేసిన యువకుడిని అరెస్టు చేశారు.