గుంటూరులో కోడలు అత్తను చపాతీ కర్రతో కొట్టి చంపిన ఘటన మరవకముందే రాజస్థాన్ లో ఇలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. కూరగాయలు సరిగా కట్ చేయాలని చెప్పినందుకు కోడలు ఆవేశంతో అదే కత్తితో తన అత్త పై దాడి చేసింది. క్షణికావేశంలో కోడలు తన అత్తను 26 సార్లు కత్తితో పొడిచిన ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జైపూర్‌లోని భంక్రోటాకు చెందిన మోహినీ దేవి 14 సంవత్సరాల కిందట తన కొడుకుకి మమతా దేవి అనే అమ్మాయితో వివాహం జరిపించింది. అత్తా కోడళ్లు తన కొడుకు ముందు ఎంతో మంచిగా కనిపిస్తున్నప్పటికీ పరస్పరం ఎదురైతే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉండేది. ఈ క్రమంలోనే కూరగాయలు సరిగా కట్ చేయాలని అత్త తన కోడలిపై దుర్భాషలాడటంతో ఎంతో ఆగ్రహం చెందిన కోడలు ఏకంగా అదే కత్తి తీసుకుని అత్తపై దాడి చేసింది.
కోడలు మమతా దేవి ఆవేశంలో తన అత్తపై ఉన్న కోపంతో ఏకంగా ఆమె శరీరంలో 26 కత్తిపోట్లు పొడవడంతో మోహిని దేవి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే తన సామాగ్రిని, పిల్లలను తీసుకుని ఇంటి నుంచి పరార్ అయింది. విషయం తెలిసిన స్థానికులు మోహిని దేవి కొడుకుకి సమాచారం అందించగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న తన తల్లిని ఆస్పత్రికి తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహిని దేవి మృతి చెందడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మమతా దేవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.