PUBG గేమ్ బారిన పడి ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు గేమ్ కారణంగా మానసిక ఒత్తిడికి గురై, తల్లిదండ్రుల నుంచి చీవాట్లు ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల నుంచి వారికి తెలియకుండా పెద్ద మొత్తంలో డబ్బును ఆ గేమ్‌లో ఖర్చు పెట్టి ఆ విధంగా బలవుతున్నారు. ప్రస్తుత తరుణంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముంబైలోనూ ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని పశ్చిమ పట్టణ ప్రాంతంలో ఉన్న జోగేశ్వరి అనే ఏరియాకు చెందిన 16 ఏళ్ల బాలుడు PUBG గేమ్‌కు బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే అతను తన తల్లి బ్యాంక్ ఖాతా నుంచి రూ.10 లక్షలను విత్‌డ్రా చేసి గేమ్‌లో ఖర్చు పెట్టాడు. గేమ్‌లో ఐడీ, వర్చువల్ కరెన్సీ, ఇతర ఐటమ్స్ కొనేందుకు అతను ఆ మొత్తాన్ని ఖర్చు చేశాడు.
అయితే ఆ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ బాలుడు ఓ లెటర్ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని ఆ బాలుడి కోసం గాలించారు.
చివరకు ఆ బాలుడు అంధేరీ ఈస్ట్ లోని మహాకాళి కేవ్స్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకుని అతన్ని ఆధీనంలోకి తీసుకుని అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడు గత నెల రోజులుగా PUBG గేమ్‌కు బానిస అయ్యాడని, ఎప్పుడూ గేమ్‌లో మునిగి తేలేవాడని, అందువల్లే ఇలా చేశాడని తల్లిదండ్రులు తెలిపారు.