సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సహజంగానే తమ అభిమానులకు రోజూ చాలా దగ్గరగా ఉంటారు. తమ సినిమాలకు సంబంధించినవే కాకుండా, వ్యక్తిగత పనులకు చెందిన పోస్టులను కూడా పెడుతుంటారు. అందులో భాగంగానే నటి శృతి హాసన్ తాజాగా తన అభిమానులతో ముచ్చటించింది.
శృతి హాసన్ ఇటీవలే ప్రభాస్ మూవీ సాలర్ హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకుని ముంబైలోని తన ఇంటికి చేరుకుంది. తన తండ్రి కమలహాసన్, బాయ్ ఫ్రెండ్ శంతానుతో కలిసి సరదాగా గడుపుతోంది. ఈ క్రమంలోనే గురువారం ఆమె ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానుల ముందుకు వచ్చింది. ఆస్క్ మి ఎవ్రీథింగ్ పేరిట ఓ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
అయితే ఒక ఫ్యాన్ ఆమెను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ ? అని అడగ్గా.. అందుకు శృతి హాసన్ బదులిస్తూ.. ఇప్పుడప్పుడే ఆ విషయం గురించి ఆలోచించడం లేదు, నేను పూర్తి నిజాయితీతో బదులిస్తున్నా, ఇది 2021, ప్రపంచ వ్యాప్తంగా అనేక కలవరపెట్టే సంఘటనలు జరుగుతున్నాయి, అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి, ప్రశాంతంగా ఉండండి.. అంటూ సమాధానం ఇచ్చింది.
ఇక శృతి హాసన్ నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. రవితేజతో కలిసి క్రాక్ మూవీలో, పవన్ కల్యాణ్‌తో కలిసి వకీల్ సాబ్ లో ఆమె నటించగా, ఆ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఆమె విజయ్ సేతుపతితో కలిసి లాబం అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే ప్రభాస్‌తో కలిసి సాలర్ అనే చిత్రంలో నటిస్తోంది.