Donkey Milk Business : సాధారణంగా మనం ఆవు లేదా గేదె పాలు తాగుతాం. ఆ పాలనే మనం ఇతర అవసరాలకు కూడా ఉపయోగిస్తుంటాం. అయితే గాడిద పాలను అసలు ఎవరూ ఉపయోగించరు. గాడిద పాలను తాగిస్తే పిల్లలకు ఎంతో మంచిదని చెప్పి కొందరు తమ పిల్లలకు ఈ పాలను తాగిస్తుంటారు. చిన్నతనంలో కొందరు గాడిదపాలను తాగే ఉంటారు. అయితే గాడిద పాలను తాగకున్నా అవి మరో రకంగా అద్భుతంగా ఉపయోగపడతాయట. ఇంతకీ అసలు గాడిద పాలను దేనికి వాడుతున్నారు.. అంటే..?
గాడిద పాలతో అనేక సౌందర్య సాధన ఉత్పత్తులను తయారు చేస్తున్నారట. దీంతో ఈ పాలకు ఎంతో డిమాండ్ ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. గుజరాత్‌కు చెందిన ధీరేన్ అనే ఓ వ్యక్తి 42 గాడిదలతో ఏకంగా గాడిద పాల వ్యాపారం చేస్తూ పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్నాడని వార్తా కథనాల్లో వస్తోంది. గాడిద పాలలో ఉండే పోషకాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయని, అందువల్ల వాటితో సబ్బులు, ఇతర సౌందర్య సాధన ఉత్పత్తులను తయారు చేస్తున్నారని చెబుతున్నారు.

42 గాడిదలతో పాల వ్యాపారం..
ఇక ధీరేన్ వద్ద మొదట 20 గాడిదలు ఉండేవట. కానీ వాటి సంఖ్య ఇప్పుడు 42కు పెరిగింది. ఈ క్రమంలోనే గాడిద పాల వ్యాపారం భలే లాభసాటిగా ఉందని అతను చెబుతున్నాడు. గాడిద పాలకు ప్రస్తుతం డిమాండ్ బాగా ఉందని అంటున్నాడు. ముఖ్యంగా కర్ణాటక, కేరళకు ఈ పాలు ఎక్కువగా సరఫరా అవుతున్నాయని, అక్కడి పరిశ్రమల వారు ఈ పాలను కొంటున్నారని తెలిపాడు.
గాడిద సాధారణంగా చాలా తక్కువ పాలను ఇస్తుంది. అందుకనే దాని పాలకు రేటు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆవు లేదా గేదె పాలు అయితే లీటర్‌కు రూ.50 నుంచి రూ.100 మధ్య ఉంటాయి. కానీ లీటర్ గాడిద పాల ధర సుమారుగా రూ.7వేల వరకు ఉంది. అందుకనే ఈ పాలను అమ్మి చాలా మంది బిజినెస్ చేస్తున్నారు. ఇక గాడిద పాలు చర్మానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయట. వీటిని తాగితే షుగర్ లెవల్స్ తగ్గడంతోపాటు శరీరంలో రక్త సరఫరా పెరుగుతుందని ఒక పరిశోధనలో సైంటిస్టులు వెల్లడించారు. ఏది ఏమైనా ఈ పాల వ్యాపారం భలే లాభసాటిగా ఉంది కదా.