హారర్ సినిమా ప్రేమికుల్లో ‘డీమాంటీ కాలనీ’ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ… తెలుగులోనూ ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాతో అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొమ్మిదేళ్ల తర్వాత ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్ తీశారు. తొలుత వేరే దర్శకుడిని అనుకున్నా… చివరకు అజయ్ ఆర్ జ్ఞానముత్తు ప్రాజెక్టులోకి వచ్చారు. అరుళ్ నిధి మరోసారి హీరోగా నటించారు. ఈసారి ఆయన డ్యూయల్ రోల్ చేయగా… ప్రధాన పాత్రలో ప్రియా భవానీ శంకర్ నటించారు. తమిళంలో ఆగస్టు 15న థియేటర్లలో విడుదల అయ్యింది. వారం ఆలస్యంగా ఆగస్టు 23న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన లభించింది.
దాదాపు కథలో మెయిన్ పాయింట్ ఒకేలా ఉన్నా.. వాటి చుట్టూ రాసుకొన్న పాత్రలు, ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమ కథ, కుట్రలు, మోసాలు లాంటి అంశాలు చక్కగా తెర మీద చెప్పాలనే ప్రయత్నంలో మరోసారి సక్సెస్ అయ్యారు దర్శకుడు. తనకు అత్యంత బలంగా మారిన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుడికి ఊపిరి సలపకుండా భావోద్వేగాలతో కట్టిపడేశాడు. అలాగే టెక్నికల్ అంశాలతో థియేటర్లలో ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురి చేశాడని చెప్పవచ్చు. రకారకాల ట్విస్టులు, టర్న్‌లతో సినిమాను ఆద్యంతం పట్టుసడలకుండా కథను నడిపించిన విధానం ఆయన ప్రతిభకి అద్దం పట్టింది అని చెప్పాలి.
ఈ సినిమాని ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఎట్టకేలకి డేట్ అనౌన్స్ చేశారు. ఈ నెల 27 నుండి తెలుగు, తమిళ భాషలలో జీ5లో డీమోంట్ కాలనీ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకొని రూ.50 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది.’డీమాంటీ కాలనీ 2’లో అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తు కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజ్ వర్మ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ సంస్థలు నిర్మించాయి.