ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే పవన్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా అడపాదడపా తన సినిమాలతో అలరించనున్నట్టు సమాచారం. ఇక పవన్ కళ్యాన్ ప్రతి సినిమాలో కనిపించే ఆలీ ఈ మధ్య దూరంగా ఉంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలీ గతంలో వైకాపాలో చేరి జనసేనను విమర్శించిన సంగతి తెలిసిందే. పరిస్థితులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడానికి దారితీయగా, పవన్ స్నేహితుడు అలీ వైసీపీలో చేరాల్సొచ్చింది. ఆ తర్వాత ఇద్దరి స్నేహం బీటలు వారింది. గత ఎన్నికల సమయంలో అలీ తన జనసేన పార్టీలో ఎందుకు చేరలేదని పవన్ ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది కొందరు జనసేన మద్దతుదారులను కలవరపెట్టింది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో అలీని నటింపజేయకపోవడంతో ఇద్దరూ ఒకరికొకరు దూరమయ్యారు. అయితే తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా అలీ పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందించాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల పవన్ హాజరు కాలేదు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధం కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన అలీ కుమార్తె వివాహం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్నికల్లో వైకాపా దారుణంగా ఓటమి పాలయ్యాక అలీ ఆ పార్టీ నుంచి నిష్కృమించిన సంగతి తెలిసిందే. అయినా కానీ చాలా కాలంగా పవన్ కళ్యాణ్, అలీ కలిసి సినిమాల్లో కనిపించ లేదు.
అయితే పవన్ `ఓజీ` సినిమాలో పవన్ అవకాశం కల్పించాడని అలీ స్వయంగా సరిపోదా శనివారం ఈవెంట్లో వెల్లడించగా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. పెద్ద తెరపై ఆ ఇద్దరి కలయికను చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇక ‘ఉత్సవం’ సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న అలీ.. పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.పవన్ కళ్యాణ్‌తో మీ అనుబంధం ఇప్పుడు ఎలా ఉందని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అలీ సమాధానం ఇస్తూ.. మా అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందని నవ్వులు పూయించారు.ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా పని చేస్తానని ఈ సందర్భంగా అలీ వివరణ ఇచ్చారు.