ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ మొబైల్ యాప్ లో త్వరలో ఓ అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. యూట్యూబ్ యూజర్లకు డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఏదైనా వీడియోను నిరంతరాయంగా ప్లే చేసుకునేలా లూప్ వీడియో అనే ఆప్షన్ అందుబాటులో ఉన్న విషయం విదితమే. అయితే అదే ఫీచర్‌ను యూట్యూబ్ త్వరలోనే తన మొబైల్ యూజర్లకు కూడా అందివ్వనుంది.
యూట్యూబ్‌ను పీసీలో ఏదైనా బ్రౌజర్‌లో ఓపెన్ చేసి అందులో ఏదైనా వీడియోను చూస్తే దానిపై రైట్ క్లిక్ చేసినప్పుడు లూప్ అనే ఫీచర్ లభిస్తుంది. దాన్ని ఎంచుకుంటే సదరు వీడియో పదే పదే ప్లే అవుతూనే ఉంటుంది. ఈ ఫీచర్ పీసీల్లోనే అందుబాటులో ఉంది. మొబైల్‌లో యూట్యూబ్ యాప్‌లో అందుబాటులో లేదు. కానీ త్వరలోనే మొబైల్ యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ను అందివ్వనున్నారు. దీన్ని యూట్యూబ్ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.
కాగా యూట్యూబ్ గత నెలలో కీలక ప్రకటన చేసింది. యూట్యూబ్‌లో షార్ట్స్ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేసే యూజర్లకు రానున్న రోజుల్లో 100 మిలియన్ డాలర్లను చెల్లించనున్నట్లు ప్రకటించింది. టిక్‌టాక్ నిషేధంతో భారత్‌లో యూట్యూబ్ షార్ట్స్ అందుబాటులోకి వచ్చింది. చాలా మంది ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుంటున్నారు. దీనికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు గూగుల్ ఆ విధంగా డబ్బును కంట్రిబ్యూటర్లకు అందించనున్నట్లు తెలిపింది.