Beast Movie : సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక సినిమాలకి పెద్ద దెబ్బే పడుతోంది. ఇటీవల కొంత మంది డైరెక్టర్స్ పాత సినిమాలని స్పూర్తిగా తీసుకొని సినిమాలు తెరకెక్కించే వారు. అప్పుడు అది ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు. కానీ సోషల్ మీడియా వచ్చాక హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టినా ఇట్టే తెలిసిపోతోంది. రాజమౌళి సినిమాలపై కూడా గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు విజయ్ సినిమాపై కాపీ మరక పడింది. విజయ్ నటించిన మాస్టర్ చిత్రం రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో బీస్ట్ చిత్రాన్ని కూడా రెండు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన బీస్ట్ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఏప్రిల్ 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. పూజా హెగ్డె హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ ఈ మూవీపై ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ స్టోరీని 2009లో వచ్చిన హాలీవుడ్ పాల్ బ్లార్ట్ : మాల్ కాప్ సినిమా నుంచి స్ఫూర్తి పొందారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ ఫేమస్ హిట్ సిరీస్ మనీ హీస్ట్‌ని కాపీ కొట్టారని అంటున్నారు.
మనీ హీస్ట్‌లో ఓ మాల్ ని నేరస్తుల ముఠా స్వాధీనం చేసుకుంటుంది. ఓ సెక్యూరిటీ గార్డ్ మాల్ లో చిక్కుకున్న ప్రజలని రక్షించడానికి నేరస్తులతో పోరాడి చివరికి వారిని రక్షిస్తాడు. బీస్ట్ కూడా సేమ్ టు సేమ్ ఇదే తరహా కథతో సాగుతుందని తెలుస్తోంది. విజయ్.. మాల్ లో ఇరుక్కున్న ఓ సైనికుడిగా కనిపిస్తాడట. మాల్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదుల్ని సైనికుడైన విజయ్ ఎలా అంతం చేశాడు ? .. ఆ మాల్ లో ఉన్న ప్రజల్ని ఎలా రక్షించాడన్నది బీస్ట్ కథగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీస్ట్ సినిమా కాపీ అంటూ ప్రచారాలు చేస్తున్నారు. మరి దీనిపై దిలీప్ కానీ, మేకర్స్ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.