అన్నం పెట్టిన వాళ్లను మనిషి గుర్తు చేసుకుంటాడో లేదో కానీ అన్నం పెట్టిన కుక్క మాత్రం విశ్వాసం చూపిస్తుంది. మనం పెంచుకునే పెంపుడు జంతువులలో కుక్క ముఖ్యమైనది. ఎందుకంటే ఇతరుల నుండి రక్షణగా యజమానికి తోడుగా ఉంటుంది. ఎవరైనా తమ యజమానులపై దాడి చేస్తే అసలు ఊరుకోదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఏనుగు నుంచి ఒక కుటుంబాన్ని వారి పెంపుడు కుక్క కాపాడింది.
కేరళలోని ఇడుక్కి జిల్లా కందులూరుకి చెందిన ఓ కుటుంబం తమ రక్షణ కోసం టామీ అనే ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటోంది. మంగళవారం సమీపంలో ఉన్న అడవి నుంచి దారి తప్పిన ఓ ఏనుగు వారి ఇంటి దగ్గరికి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యుల వైపు ఆ ఏనుగు పరుగులు పెట్టింది. అయితే టామీ వెంటనే ఆ ఏనుగు దగ్గరికి వచ్చి దాని కాళ్ళను కరిచింది.
ఆ ఏనుగు తిరిగి టామీపై దాడి చేస్తూ తన దంతాలతో టామీ కడుపులో పొడిచింది. ఇక టామీ పరిస్థితి ప్రాణాలు పోయే వరకు వచ్చింది. అయినా తన యజమాని కుటుంబాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తిరిగి ఏనుగుపై మళ్లీ దాడి చేసింది. ఏనుగు కళ్ళను తన కాళ్లతో గుచ్చడంతో వెంటనే ఏనుగు అక్కడి నుంచి పారిపోయింది. దీంతో టామీకి హాస్పిటల్ లో చికిత్స అందించారు. అయితే అది బుధవారం మరణించింది. దీంతో దాని యజమాని కుటుంబం కన్నీరు మున్నీరైంది. ఈ విషయం వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు కూడా కుక్క చూపించిన విశ్వాసాన్ని మెచ్చుకుంటూ దాని ప్రాణాలు పోయాయని బాధపడుతున్నారు.