పీకలదాకా మద్యం సేవిస్తే కొందరు వింతగా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే ఇతరుల మీద దాడికి దిగుతుంటారు. అనవసరంగా న్యూసెన్స్ చేస్తుంటారు. ఓ యువతి కూడా సరిగ్గా ఇలాగే చేసింది. మద్యం మత్తులో నడి రోడ్డుపై రెచ్చి పోయింది. ఏకంగా ఆర్మీ వాహనానికి ఎదురుగా నిలబడి దాని తన్నింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నడిరోడ్డుపై 22 ఏళ్ల ఓ యువతి పీకలదాకా మద్యం సేవించి హల్‌చల్ చేసింది. తనకు ఎదురుగా వచ్చిన ఆర్మీ వాహనాన్ని ఆపి దానికి ఎదురుగా నిలబడి కాలితో తన్నింది. వాహనానికి చెందిన హెడ్ లైట్‌పై తన్నుతూ దాన్ని ధ్వంసం చేసింది.
ఈ క్రమంలో వాహనం నుంచి ఓ ఆర్మీ అధికారి బయటకు వచ్చి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె వినలేదు. దీంతో స్థానికులు సమీపంలో ఉన్న పాడవ్ పోలీస్ స్టేషన్‌కు కాల్ చేయగా వారు ఓ మహిళా కానిస్టేబుల్‌ను పంపించారు. ఆ యువతిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
https://twitter.com/EimKrrish/status/1436008503311695874
అయితే ఢిల్లీ నుంచి ముగ్గురు మోడల్స్‌కు గ్వాలియర్‌కు ఓ ఈవెంట్ నిమిత్తం వచ్చారు. కానీ వారిలో ఈ ఒక్క యువతి మద్యం సేవించి అలా చేసింది. దీంతో విషయం తెలుసుకున్న మరో ఇద్దరు మోడల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల కాళ్ల మీద పడ్డారు. తాము ఢిల్లీ నుంచి ఈవెంట్ కోసం వచ్చామని, ఆమె చేసిన పనికి చింతిస్తున్నామని, దయచేసి విడిచి పెట్టాలని కోరారు. దీంతో పోలీసులు ఆ మద్యం యువతిని బెయిల్ మీద విడిచిపెట్టారు.
కాగా ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో ఏకంగా ఆర్మీ వాహనాన్నే తన్నడంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.