ఒకప్పుడు దేవతా విగ్రహాలకు భక్తులు పెద్ద ఎత్తున బంగారు లేదా వెండి కిరీటాలను, ఇతర అలంకరణ వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు. అయితే తాజాగా కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి జీవితంలో మాస్క్ అనేది ఒక భాగమైపోయింది. ఈ క్రమంలోనే అమ్మవారి అలంకరణలో కూడా మాస్క్ భాగమైంది. తాజాగా కోల్‌కతా బగుయాటీ ఏరియాలోని పూజా మండపంలో అమ్మవారికి 20 గ్రాముల బంగారంతో చేసిన మాస్క్ తొడిగారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేవలం అమ్మవారి విగ్రహానికి మాస్క్ తోడగడమే కాకుండా అమ్మవారి చేతిలో ఆయుధాలకు బదులుగా శానిటైజర్ లు, సిరంజీలు, ఆక్సి మీటర్లు, వంటి వైద్య పరికరాలు ఉంచడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేయడానికి కూడా ఒక కారణం ఉంది.ఈ విధంగా అమ్మవారికి మాస్క్ వేయటం వల్ల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సైతం మాస్కులు ధరిస్తారని, ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలను పాటించడం వల్ల కరోనాను తరిమికొట్టడానికి వీలవుతుందని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అమ్మవారి విగ్రహం ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా అమ్మ వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, బెంగాల్ సింగర్ అదితీ మున్షీ అన్నారు. బెంగాల్‌లో అత్యంత వైభవంగా జరిగే కాళీ మాత వేడుకలలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడం వల్ల కరోనా వ్యాప్తికి కారకులవుతారు కనుక ఈ క్రమంలోనే ప్రజలు పెద్ద ఎత్తున ఒకేచోట చేరకుండా ఎక్కడికక్కడ ఈ విధమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.