స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం మనకు అనేక రకాల ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి. అద్భుతమైన కెమెరాలను అందిస్తున్నారు. దీంతో క్వాలిటీ ఉన్న హెచ్‌డీ ఫొటోలు, వీడియోలను షూట్ చేసుకోగలుగుతున్నాం. చాలా తక్కువ ధరలకే మంచి ఫీచర్లు కలిగిన ఫోన్లు లభిస్తున్నాయి. అయితే ఫోన్లలో సహజంగానే వైఫై కాలింగ్ అనే ఫీచర్ ఉంటుంది. ఇది ఏమిటో, ఎలా పనిచేస్తుందో, దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం ఎవరికైనా కాల్ చేస్తే మన ఫోన్‌లో సిమ్ ద్వారా నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి కాల్ వెళ్తుంది. అవతలి వారు కాల్ చేసినా ఇలాగే జరుగుతుంది. ఈ రెండు సందర్భాల్లోనూ మొబైల్ నెట్ వర్క్ కీలకం. నెట్ వర్క్ సిగ్నల్ సరిగ్గా లేకపోతే కాల్స్ చేయలేం. కాల్స్ డ్రాప్ అవడమో, కనెక్ట్ కాకపోవడమో జరుగుతుంది.
అయితే ఇంట్లో లేదా ఆఫీస్‌లో లేదా బయట ఎక్కడైనా ఉన్నప్పుడు ఫోన్‌లో సిగ్నల్ లేకపోతే.. సమీపంలో వైఫై ఉంటే అందులో వైఫై కాలింగ్ అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. దీంతో మొబైల్ సిగ్నల్ సరిగ్గా లేకపోయినా వైఫై ద్వారా కాల్ కనెక్ట్ అవుతుంది. అవతలి వారు చేసినా కాల్ వస్తుంది. అయితే అవతలి వారు వైఫై కాలింగ్‌ను ఆన్ చేసుకోకపోయినా ఫర్వాలేదు. వారి మొబైల్‌లో సిగ్నల్ ఉంటే చాలు. కానీ మన మొబైల్ లో సిగ్నల్ లేకపోతే వైఫై కాలింగ్‌ను ఆన్ చేయాలి. దీంతో సిగ్నల్ వీక్ ఉన్నా కాల్స్ చేసుకోవచ్చు.
ఇక ఇదే సూత్రం అవతలి వారికి కూడా వర్తిస్తుంది. అంటే మనకు సిగ్నల్ బాగానే ఉన్నా అవతలి వారికి లేకపోతే వారు వైఫైకి కనెక్ట్ అయి వైఫై కాలింగ్ ఫీచర్‌ను ఆన్ చేసుకోవచ్చు. దీంతో సిగ్నల్ వీక్ ఉన్నా వారు మనకు కాల్స్ చేయగలుగుతారు. అలాగే మనం వాళ్లకు కాల్స్ చేయవచ్చు. ఇలా వైఫై కాలింగ్ ఫీచర్ పనిచేస్తుంది.
మన ఇంట్లో అయితే వైఫై కి కనెక్ట్ అయి ఉంటే చాలు. అదే బయట ఉంటే ఆఫీస్‌లో పనిచేసే వారు అయితే ఆఫీస్ వైఫైకి కనెక్ట్ అవ్వాలి. లేదా బయట ఎక్కడైనా ఉంటే అక్కడ వైఫై అందుబాటులో ఉంటే దానికి కనెక్ట్ అవవచ్చు. ఇలా వైఫైకి కనెక్ట్ అయి వైఫై కాలింగ్ ఫీచర్ ను వాడుకోవచ్చు.
ఇక ఫోన్‌లో వైఫై కాలింగ్ ఫీచర్‌ను ఆన్ చేయాలంటే.. ఫోన్ లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో ఉండే వైఫై, ఇంటర్నెట్ ఫీచర్‌ను ఎంచుకోవాలి. తరువాత వచ్చే స్క్రీన్‌లో సిమ్ అండ్ నెట్‌వర్క్ ను ఎంచుకోవాలి. డ్యుయల్ సిమ్ అయితే రెండు సిమ్‌లను చూపిస్తుంది. అందులో ఏదైనా ఒక సిమ్‌ను ఎంచుకోవాలి. తరువాత వచ్చే విండోలో వైఫై కాలింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయాలి. దీంతో వైఫైకి కనెక్ట్ అయి ఉన్నప్పుడల్లా మొబైల్ సిగ్నల్ వీక్‌గా ఉంటే.. కాల్స్ చేసినప్పుడు వైఫై కాలింగ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. కాల్స్ ను ఆటంకం లేకుండా చేసుకోవచ్చు. మొబైల్ సిగ్నల్ వీక్‌గా ఉన్నప్పుడు వైఫైకి కనెక్ట్ అయితే చాలు, ఆటోమేటిగ్గా మనం చేసే కాల్స్ వైఫై ద్వారా వెళ్తాయి. అందుకు గాను పైన తెలిపిన ఫీచర్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచాలి. ఇలా వైఫై కాలింగ్ ఫీచర్ పనిచేస్తుంది.