ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 5జి సేవలను అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఆ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా 5జి కి సపోర్ట్‌ను ఇచ్చే ఫోన్లను తయారు చేసి అందిస్తున్నాయి. అయితే 4జి టెక్నాలజీలో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంటుందో మనకు తెలుసు. మరి 5జి టెక్నాలజీలో స్పీడ్ ఎలా ఉంటుంది ? తెలుసా ? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
5జి టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ స్పీడ్ ఏకంగా 1జీబీపీఎస్ నుంచి 10 జీబీపీఎస్ వరకు వస్తుంది. ప్రస్తుతం 4జిలో గరిష్టంగా 300 ఎంబీపీఎస్ వరకు మాత్రమే స్పీడ్ లభిస్తోంది.
4జి ద్వారా ఒక సినిమా డౌన్‌లోడ్‌కు 7 నిమిషాలు పడుతోంది. కానీ 5జి ద్వారా కేవలం 6 సెకన్లలోనే సినిమా డౌన్‌లోడ్ అవుతుంది. సోషల్ మీడియా కంటెంట్ వేగంగా లోడ్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాను సందర్శించినప్పుడల్లా 2 నిమిషాల 20 సెకన్ల సమయాన్ని ఆదా చేయవచ్చు. అలాగే నెలకు 24 గంటల డౌన్‌లోడ్ సమయం ఆదా అవుతుంది. 5జి వల్ల వేగంగా ఇంటర్నెట్‌ను పొందవచ్చన్నమాట. దీంతో ఎంతో సమయం ఆదా అవుతుంది.