ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల ఓఎస్‌లు ఉన్న ఫోన్లు మనకు అందుబాటులో ఉన్న విషయం విదితమే. ఒకటి ఆండ్రాయిడ్. రెండోది ఐఓఎస్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ డెవలప్ చేసింది. యాపిల్ సంస్థ ఐఓఎస్‌ను డెవలప్ చేసింది. అయితే అనేక రకాల కంపెనీలకు చెందిన ఫోన్లలో మనకు ఆండ్రాయిడ్ వివిధ వెర్షన్లలో లభిస్తుంది. కానీ ఐఓఎస్ మాత్రం కేవలం యాపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్‌లలోనే లభిస్తుంది. ఇతర కంపెనీలకు చెందిన ఫోన్లలో లభించదు. ఇక ఈ రెండింటి మధ్య ఉండే తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్‌ను గూగుల్ డెవలప్ చేయగా, ఐఓఎస్‌ను యాపిల్ డెవలప్ చేసింది. ఆండ్రాయిడ్ మార్కెట్ వాటా 74 శాతంగా ఉంది. ఐఓఎస్ మార్కెట్ వాటా 25 శాతంగా ఉంది. మిగిలిన 1 శాతం వాటాను ఇతర ఓఎస్‌లు కలిగి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ చాలా పాపులర్ అయ్యింది.
ఆండ్రాయిడ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. గూగుల్ ఈ ఓఎస్ ను ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ కొత్త కొత్త వెర్షన్‌లను విడుదల చేసింది. వాటికి చెందిన సోర్స్ కోడ్‌ను కూడా అందుబాటులో ఉంచుతుంది. దీంతో డెవలపర్లు ఎవరు అయినా సరే ఆ సోర్స్ కోడ్‌ను తీసుకుని తమకు అనుగుణంగా ఆండ్రాయిడ్‌ను మార్చుకోవచ్చు. అందుకనే ప్రస్తుతం మార్కెట్‌లో అనేక కంపెనీలకు చెందిన ఫోన్లలో ఓఎస్ భిన్నంగా ఉంటుంది. అయితే వాటికి మూలాధారం మాత్రం.. ఆండ్రాయిడ్ కావడం విశేషం. అందువల్ల గూగుల్ ప్లే స్టోర్‌కు సపోర్ట్ లభిస్తుంది.
ఇక ఐఓఎస్ అనేది ఓపెన్ సోర్స్ కాదు. దాన్ని యాపిల్ సంస్థ డెవలప్ చేస్తుంది. అది కేవలం ఐఫోన్లు, ఐప్యాడ్‌లలోనే అందుబాటులో ఉంటుంది కనుక దాని సోర్స్ కోడ్ ఎవరికీ ఇవ్వరు. యాపిల్ సంస్థే స్వయంగా ఆ బాధ్యతను నిర్వర్తిస్తుంది. తమ వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా యాపిల్ తమ ఐఓఎస్ కు గాను సోర్స్ కోడ్ ఇవ్వడం లేదు.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు చాలా తక్కువ ధరను కలిగి ఉంటాయి. ఐఓఎస్ ఉన్న ఫోన్ల ధర ఎక్కువగా ఉంటుంది. కేవలం రూ.5000 పెడితే ఆండ్రాయిడ్ ఫోన్‌ను పొందవచ్చు. కానీ బేసిక్ ఐఫోన్‌ను కొనాలన్నా కనీసం రూ.30వేల వరకు వెచ్చించాలి. సెకండ్ హ్యాండ్ ఐఫోన్లు అయితే రూ.20వేలకు వస్తాయి. కనుక ఆండ్రాయిడ్ తో పోలిస్తే యాపిల్ ఫోన్లు ఖరీదైనవి అని చెప్పవచ్చు.
ఇక యాపిల్‌కు చెందిన ఐఓఎస్‌లో భద్రత పటిష్టంగా ఉంటుంది. ఆ ఫోన్లను అంత సులభంగా హ్యాక్ చేయలేరు. అలాగే యాపిల్ సంస్థ తమ ఫోన్లకు దాదాపుగా 6-7 ఏళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లకు అంత ఎక్కువ కాలం అప్‌డేట్స్ రావు. కేవలం 2-3 ఏళ్ల వరకు మాత్రమే అప్‌డేట్స్ లభిస్తాయి. హ్యాకర్లు ఆండ్రాయిడ్ ఫోన్లను సులభంగా హ్యాక్ చేయగలరు. యూజర్ల డేటాకు ముప్పు ఎక్కువ. ఐఫోన్లు అలా కాదు. సెక్యూరిటీ బాగా ఉంటుంది.
ఇక రెండింటికీ ఉన్న తేడాలు చూశారు కదా. ఈపాటికే మీకు ఏది బెస్ట్ ఓఎస్ అనే విషయం అర్థమైపోయి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్.. రెండింటిలో సెక్యూరిటీ, అప్‌డేట్స్ పరంగా చూస్తే ఐఓఎస్‌కు మంచి మార్కులు పడతాయి. కానీ చవక ధరకు ఫోన్‌ను కొనాలంటే ఆండ్రాయిడ్ ఉత్తమమైంది. కనుక తక్కువ ధరకు ఫోన్ కావాలంటే ఆండ్రాయిడ్ ఉన్న ఫోన్‌లను కొనాలి. స్థోమత ఉంది అనుకుంటే ఐఫోన్‌లను వాడడం ఉత్తమం.