ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 7వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్స్ జట్టు వెనుకబడింది. అయినప్పటికీ టెయిలెండర్లు ఎదురొడ్డి మ్యాచ్ చేజారిపోకుండా కాపాడారు. లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో ఢిల్లీపై రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ఢిల్లీ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ రిషబ్ పంత్ ఒక్కడే రాణించాడు. 32 బంతులు ఆడిన పంత్ 9 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో జయదేవ్ ఉనడ్కట్ 3 వికెట్లు పడగొట్టగా ముస్తాఫిజుర్ రహమాన్ 2 వికెట్లు తీశాడు. క్రిస్ మోరిస్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్‌లు అద్భుతంగా రాణించారు. 43 బంతులు ఆడిన మిల్లర్ 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేయగా, 18 బంతుల్లో మోరిస్ 4 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా క్రిస్ వోక్స్, కగిసో రబాడాలు చెరో 2 వికెట్లు తీశారు.