అహ్మదాబాద్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 21వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా ఛేదించింది. కొన్ని వికెట్లను కోల్పోయినప్పటికీ ఇంకా ఓవర్లు మిగిలి ఉండగానే కోల్‌కతా లక్ష్యాన్ని చేరుకుంది. ఈ క్రమంలో పంజాబ్‌పై కోల్‌కతా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో మయాంక్ అగర్వాల్, క్రిస్ జోర్డాన్‌లు ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. 34 బంతులు ఆడిన మయాంక్ 1 ఫోర్, 2 సిక్సర్లతో 34 పరుగులు చేయగా, 18 బంతులు ఆడిన జోర్డాన్ 1 ఫోర్, 3 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్‌లు చెరో 2 వికెట్లు తీశారు. శివమ్ మావీ, వరుణ్ చక్రవర్తిలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ ఇయాన్ మెర్గాన్, రాహుల్ త్రిపాఠిలు రాణించారు. 40 బంతులు ఆడిన మోర్గాన్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 32 బంతుల్లో త్రిపాఠి 7 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో మాయిసస్ హెన్రికస్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, దీపక్ హుడాలకు తలా 1 వికెట్ దక్కింది.