అహ్మదాబాద్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 29వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ నిలిపిన లక్ష్యాన్ని ఢిల్లీ సునాయాసంగానే ఛేదించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. దీంతో పంజాబ్‌పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్లలో మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. 58 బంతులు ఆడిన మయాంక్ 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో కగిసో రబాడా 3 వికెట్లు పడగొట్టగా అవేష్ ఖాన్, అక్షర్ పటేల్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 167 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్, పృథ్వీ షాలు అద్భుతంగా రాణించారు. 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో ధావన్ 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, పృథ్వీ షా 22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో రైలీ మెరెడిత్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బ్రార్‌లకు తలా 1 వికెట్ దక్కింది.