ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 16వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బంపర్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని బెంగళూరు అలవోకగా ఛేదించింది. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఇంకా 21 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో రాజస్థాన్‌పై బెంగళూరు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా రాజస్థాన్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో శివం దూబె, రాహుల్ తెవాతియాలు రాణించారు. 32 బంతులు ఆడిన దూబె 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేయగా, 23 బంతులు ఆడిన తెవాతియా 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్‌లు చెరో 3 వికెట్లు పడగొట్టగా, కైలీ జేమిసన్, కేన్ రిచర్డ్సన్, వాషింగ్టన్ సుందర్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ చివరి వరకు ఆడి జట్టును గెలిపించారు. కేవలం ఇద్దరే టార్గెట్‌ను ఛేదించడం విశేషం. విరాట్ కోహ్లి, దేవదత్త్ పడిక్కల్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ క్రమంలో కోహ్లి అర్ద సెంచరీతో కదం తొక్కగా పడిక్కల్ సెంచరీ చేశాడు. 47 బంతులు ఆడిన కోహ్లి 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 52 బంతుల్లోనే పడిక్కల్ 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లు ఎంత శ్రమించినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.