ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎన్నో చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిలో ఉండే మిస్టరీలను ఇప్పటికీ కనుగొనలేకపోయారు. అలాంటి ప్రదేశాల్లో కెనడాలో ఉన్న మ్యాజికల్ లేక్ ఒకటి. దీన్నే క్లిలుక్ సరస్సు అని కూడా పిలుస్తారు. ఈ సరస్సులోని నీటికి మహిమలు ఉన్నాయని, దాంతో అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని ఇప్పటికీ స్థానికులు విశ్వసిస్తారు.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ఒకనగన్ వాలీలో క్లిలుక్ అనే సరస్సు ఉంది. కొందరు దీన్ని ఖిలుక్ సరస్సు అని కూడా పిలుస్తారు. సాధారణ రోజుల్లో ఈ సరస్సు నీటితో దర్శనమిస్తుంది. కానీ వేసవిలో నీరు అంతా ఆవిరైపోతుంది. అక్కడక్కడా చిన్న చిన్న నీటి గుంతలు ఉంటాయి. అయితే ఈ నీటిలో అనేక రకాల ఖనిజాలు, లవణాలు కలిసి ఉంటాయి. అందువల్ల వాటి సాంద్రతకు అనుగుణంగా ఆ నీటి గుంతలు వివిధ రకాల రంగుల్లో కనిపిస్తాయి.
ఒక్కో నీటి గుంత వద్ద ఉండే ఖనిజాలు, లవణాల శాతాన్నిబట్టి నీటి గుంతల్లో ఉండే నీటి రంగు మారుతుంది. ఆ సరస్సులో సుమారుగా 365కు పైగా నీటి గుంతలు ఏర్పడుతాయి. అయితే ఒకప్పుడు అక్కడి ప్రజలు ఈ సరస్సును అత్యంత పవిత్రమైందిగా భావించేవారు. అందులో ఉన్న నీటితో అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని విశ్వసించేవారు.
ఒక్కో గుంతలో ఉండే నీటితో భిన్న రకాల వ్యాధులు నయం అవుతాయని స్థానికులు చెబుతారు. అయితే 2001 వరకు ఈ సరస్సు, దాని చుట్టూ ఉన్న ప్రాంతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండేది. కానీ ఆ తరువాత ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. అత్యంత చారిత్రాత్మకమైన ప్రదేశం కావడంతోపాటు అనేక మిస్టరీలు ఈ సరస్సులో ఉండడంతో దాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ఆ స్థలం మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి అక్కడి ప్రభుత్వమే ఈ సరస్సును పర్యవేక్షిస్తోంది.