Doomsday Fish : గతంలో 2012లో యుగాంతం వస్తుందని మయన్ల క్యాలెండర్, నాస్ట్రోడోమస్ అంచనాలను బట్టి చెప్పారు. కానీ యుగాంతం జరగలేదు. అయితే కలియుగం ఎప్పుడు అంతం అవుతుంది.. అన్న విషయంపై కూడా స్పష్టత లేదు. కానీ యుగాంతం అయినప్పుడు మాత్రం ఎటు చూసినా జల ప్రళయమే ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. తరువాత కొన్ని ఏళ్లకు మళ్లీ సృష్టి క్రమం ప్రారంభమవుతుందని పురాణాల్లో చెప్పారు. అయితే వీటి సంగతేమో కానీ కొందరు మాత్రం త్వరలో యుగాంతం రాబోతుందని, అందుకు ఆ చేప కనిపించడమే సూచన.. అని చెబుతున్నారు. ఇంతకీ అసలు ఆ చేప ఏమిటి.. దానికి, యుగాంతానికి సంబంధం ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగస్టు 10, 2024వ తేదీన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న తీర ప్రాంతానికి ఒక చేప కొట్టుకు వచ్చి సముద్రపు నీటిలో కనిపించింది. చూసేందుకు ఒక పొడవైన రిబ్బన్‌ను పోలి ఆ చేప ఉంది. కానీ అది చనిపోయి ఉంది. ఆ చేప అరుదైన జాతికి చెందిన చేప అని సైంటిస్టులు నిర్దారించారు. దీన్నే ఓర్‌ఫిష్ అని లేదా డూమ్స్‌డే ఫిష్ అని అంటారు. అంటే యుగాంతం వచ్చే ముందు ఈ చేప సముద్రంలో కనిపిస్తుందన్నమాట. అందుకనే దీనికి డూమ్స్‌డే ఫిష్ అని కూడా పేరు పెట్టారు.

చేప ఎందుకు చనిపోయిందో తెలియదు..
ఇక ఈ చేపను అమెరికాలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్స్ (ఎన్‌వోఏఏ) అనే చోటుకు తరలించారు. అక్కడ సైంటిస్టులు ఈ చేపపై క్షుణ్ణంగా ప్రయోగాలు చేశారు. ఈ చేపను పూర్తిగా పరిశీలిన అనంతరం అక్కడి సైంటిస్టులు వివరాలను వెల్లడించారు. ఈ చేప చూస్తే ఆరోగ్యంగానే ఉందని, కానీ ఎందుకు చనిపోయిందో తెలియదని చెప్పారు.
యుగాంతానికి ఇదే సూచన..?
ఇక ఈ చేప 12.25 అడుగుల పొడవు, 1.14 అడుగుల వెడల్పు ఉందని, దీని బరువు 33.7 కిలోలుగా ఉందని తెలిపారు. ఈ చేపలు సాధారణంగా సముద్రం పై భాగానికి రావని, సముద్ర గర్భంలోనే ఉంటాయని చెబుతున్నారు. అయితే కొందరు ఔత్సాహికులు మాత్రం త్వరలో యుగాంతం రాబోతుందని, దానికి సూచనగానే ఈ చేప సముద్రంలో కనిపించిందని అంటున్నారు. అయితే ఈ చేప కనిపించిన తరువాత 2 రోజులకు అమెరికాలోని లాస్ ఏంజలస్‌లో భూకంపం రావడం విశేషం. రిక్టర్ స్కేలు భూకంప తీవ్రత 4.4 గా నమోదు అయింది. అందువల్లే కొందరు యుగాంతానికి ఈ చేప సూచన అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.