ప్రస్తుత తరుణంలో వివాహ సంబంధాలు చాలా వరకు కల్తీ అయిపోతున్నాయి. ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకుంటూ కొందరు జీవిత భాగస్వామిపై కక్ష పెంచుకుని వారిని అంతమొందిస్తున్నారు. ప్రియుడు లేదా ప్రియురాలు కోసం జీవిత భాగస్వామిని అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారు. ఈ సంఘటనలను మనం తరచూ చదువుతూనే ఉన్నాం. అయితే తాజాగా అక్కడ కూడా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడి కోసం భర్తను పొట్టన పెట్టుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్‌లోని మథుర జిల్లా బల్దేవ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సేల్‌ఖేఢా గ్రామంలో సుబేదార్‌సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో అతని చిన్న కుమారుడు మాన్వేంద్రకు వివాహం చేశాడు. గ్రామ శివారులో వారికి మరో ఇల్లు ఉంది. దీంతో పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత మాన్వేంద్ర, తన భార్య ఆ ఇంట్లో ఉండడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఒక రోజు రాత్రి ఆ ఇంట్రో నిద్రించారు. అయితే అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత కోడలు తన మామకు ఫోన్ చేసి మాన్వేంద్రకు కరెంట్ షాక్ కొట్టిందని చెప్పింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆ ఇంటికి చేరుకుని మాన్వేంద్రను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మాన్వేంద్ర చనిపోయినట్లు తెలిపారు.
దీంతో కరెంటు షాక్ వల్లే మాన్వేంద్ర చనిపోయాడని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియులు కూడా చేశారు. కానీ కొన్ని రోజుల తరువాత అసలు విషయం బయట పడింది. మాన్వేంద్ర ఫోన్‌కు విపరీతంగా కాల్స్ వస్తుండడంతో అనుమానించిన సుబేదార్ వెంటనే ఆ ఫోన్‌ను పరిశీలించాడు. అందులో ఉన్న కాల్ రికార్డింగ్స్‌ను విన్నాడు. ఆ రికార్డింగ్‌లలో మాన్వేంద్ర భార్య ఇంకో వ్యక్తితో మాట్లాడింది అంతా రికార్డ్ అయి ఉంది. వారు మాన్వేంద్రకు కరెంటు షాక్ ఇచ్చి చంపేశారని.. వారి కాల్ రికార్డింగ్స్ ద్వారా సుబేదార్‌కు అర్థమైంది. అయితే అప్పటికే మాన్వేంద్ర భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆమెను సుబేదార్ నిలదీశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మాన్వేంద్ర భార్య తన ప్రియుడితో పరారీలో ఉండడంతో పోలీసులు ఆమెను గాలించి పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాక విచారించగా తామే ఆ నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో వారిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.