Paruchuri Venkateswara Rao : సీనియర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు ఎన్నో సినిమాలకు పని చేసిన విషయం తెలిసిందే. కేవలం రచయితగానే కాకుండా నటుడిగా కూడా అదరగొట్టారు. టాలీవుడ్‌లో దశాబ్దాల కాలంగా చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్స్ అందరి చిత్రాలకు రచనలు అందించారు పరుచూరి బ్రదర్స్. కొత్త తరం రావడంతో సహజంగానే వారి జోరు తగ్గింది. ఇటీవల పరుచూరి వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

ఆ ఫొటోలో పరుచూరిని గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగానే మారింది. అంతగా మారిపోయారు. దీంతో ఆయనకు అంతు పట్టని వ్యాధి ఏదో సోకిందంటూ రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. ఇక ఆ ఫోటో నెట్టింట్లో బాగానే చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై ఆయన సోదరుడు పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ చానల్‌లో స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. 2017లో అన్నయ్య ఆస్ట్రేలియా వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం, శరీరంలో తేడాలు వచ్చాయి. వైద్య పరీక్షలు చేసుకుంటే డాక్టర్లు ఆహార నియమాలు ఫాలో కావాలి చెప్పారు. అంతకు మించి ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.
జుట్టుకి రంగు వేసుకోకపోవడం.. బరువు తగ్గడం వల్ల అలా కనిపిస్తున్నారు. నేను కూడా రెండేళ్లలో 10 కిలోల బరువు తగ్గాను. ఫోటోలో అలా కనిపిస్తున్నారు అంతే. అలాంటి ఫోటో ఎందుకు షేర్ చేశావయ్యా అని జయంత్ ని ప్రశ్నించాను. ఈ ఫోటో చూసిన వారిలో తెలిసిన వ్యక్తి ఒకరు 80 ఏళ్ల వయసు వచ్చిన వ్యక్తి ఇంకెలా ఉంటారు అని ప్రశ్నించారు. దీంతో నేను కరెక్ట్ గా చెప్పానని అన్నారని గోపాలకృష్ణ వీడియాలో స్పష్టం చేశారు. కాగా ఆ ఫోటోని జయంత్ పరాన్జీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.