Vijayashanti : నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద దుమారానే రేపుతున్నాయి. ఈమె యూపీలో గోహత్యలు, కాశ్మీర్‌లో కాశ్మీర్ పండిట్ల హత్యలు ఒకటేనని.. పెద్దగా తేడా ఏమీ లేదని.. కామెంట్లు చేసింది. దీంతో ఆమెపై భజరంగ్ దళ్ ఫిర్యాదు చేసింది. సాయిపల్లవి తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై రాములమ్మగా పేరుగాంచిన నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. సాయిపల్లవిని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు.
సాయిపల్లవి తాజాగా చేసిన వ్యాఖ్యలను విజయశాంతి ఖండించారు. ఆమె కామెంట్స్ వివాదాస్పదంగా ఉన్నాయన్నారు. ఆవులను చంపడం, కాశ్మీర్ పండిట్లను హత్య చేయడం రెండూ ఒకటే ఎలా అవుతాయని ప్రశ్నించారు. ఒక దొంగను కొట్టడం, తల్లి తన కుమారున్ని మందలించడం రెండూ ఒకటే ఎలా అవుతాయని.. అన్నారు. అలాగే సాయిపల్లవికి అసలు సమాజంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏం జరుగుతుంది.. అన్న విషయాలపై అవగాహన లేదని, అలాంటప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదని.. ఆమె నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని.. విజయశాంతి అన్నారు.

సెలబ్రిటీలుగా చెలామణీ అవుతున్నవారు సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు వెనుకా ముందు చూసుకుని.. బాగా ఆలోచించి మాట్లాడాలని.. విజయశాంతి అన్నారు. సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమాకు ప్రచారం కల్పించడం కోసమే ఆమెతో ఎవరో ఇలా మాట్లాడిస్తున్నారని.. విజయశాంతి ఆరోపించారు. అయితే ఈ వివాదం రోజు రోజుకీ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఈ క్రమంలోనే దీనిపై సాయిపల్లవి స్పందించాల్సి ఉంది.