Vijayashanthi : సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయ రంగంలోనూ లేడీ సూపర్ స్టార్‌గా విజయశాంతి తనదైన ముద్ర వేశారు. సినిమాలకు గుడ్ బై చెప్పాక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. తరువాత తెరాస లో ఆ తరువాత కాంగ్రెస్.. ఇప్పుడు మళ్లీ సొంత గూడు బీజేపీలోనే ఆమె చేరారు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ఆమె మళ్లీ సినిమాల్లోనూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మంచి క్యారెక్టర్ వస్తే సినిమాల్లో నటించేందుకు సిద్ధమని కూడా ఆమె ప్రకటించారు. అయితే ఆమె ప్రస్తుతం పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు, చిరంజీవికి చెందిన పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె పంచుకున్నారు.

అప్పట్లో చిరంజీవి, విజయశాంతి జంట అంటే.. చాలా ఫేమస్. వీరు కలసి నటించిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అయితే సరిలేరు నీకెవ్వరు ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడిన తీరు ఆశ్చర్యానికి గురి చేసిందని విజయశాంతి అన్నారు. అప్పటికి ఆయన తనతో మాట్లాడి 20 ఏళ్లు అయిందని అన్నారు. అయితే సినిమాల్లో నటించినప్పుడు బాగానే మాట్లాడుకునేవారమని.. కానీ రాజకీయాల్లో చేరాక సీరియస్ నెస్ వచ్చిందని.. కనుక ఇప్పుడు మాట్లాడుకోవడం తగ్గిందన్నారు.
ఇక అప్పట్లో సినిమాలకు 100 రోజులు, 200 రోజులు, 365 రోజుల ఫంక్షన్లు చేసేవారని.. కానీ ఇప్పుడు ఒక సినిమా వారం రోజుల పాటు ఆడితేనే చాలా గొప్ప అని అన్నారు. సినిమాలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారని.. అవి కొత్తగా అనిపిస్తున్నాయని తెలిపారు. ఇక అప్పట్లో తాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ సాధనకు మద్దతు ఇవ్వాలని సినీ ఇండస్ట్రీ వాళ్లను అడిగానని.. కానీ ఎవరూ సపోర్ట్ చేయలేదని.. ఇప్పుడు ఆ విషయం మాట్లాడితే భయంకరంగా ఉంటుందని అన్నారు.