Venkatesh : తెలుగు సినీ ప్రేక్షకులకు విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కెరీర్ తొలినాళ్లలో చేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అందుకనే విక్టరీని తన పేరుకు తగిలించుకున్నారు. ఇక వెంకటేష్‌తోపాటు ఆయన కుటుంబం మొత్తం లో ప్రొఫైల్ ను మెయింటెయిన్ చేస్తారు. వారు ఎక్కువగా బయట కనబడరు. కానీ వెంకటేష్ మాత్రం ఎప్పుడో మరీ ముఖ్యమైన ఫంక్షన్ ఉంటే తప్ప వెళ్లరు. అలాగే ఇతర సినిమాలకు చెందిన ప్రీ రిలీజ్ వేడుకల్లోనూ ఈయన కనిపించేది తక్కువే.
ఇక వెంకటేష్ ఇప్పటి వరకు వివాద రహితుడిగా ఉన్నారు. ఆయన అవసరమైన విషయాల జోలికి వెళ్లరు. ఏ వివాదంలోనూ చిక్కుకున్న దాఖలాలు లేవు. ఎక్కడ ఎలా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి.. ఎక్కడ తగ్గి ఉండాలి.. అనే విషయం కచ్చితంగా తెలిసి ఉన్న వ్యక్తి వెంకటేష్. అయితే సీనియర్ నటుడు మురళీ మోహన్ ఈ మధ్యే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ వెంకటేష్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు.

వెంకటేష్‌కు మొహమాటం ఎక్కువని మురళీ మోహన్ తెలిపారు. మా అసోసియేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి అధ్యక్షుడి స్థానంలో హీరోలనే ఉండాలని నిర్ణయించాం. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియన్లు, ఇతర చిత్ర యూనిట్‌కు చెందిన వారు అయితే పెద్దగా పేరు ఉండదు. వారిని అధ్యక్షులుగా చేసినా వారు చెప్పేది హీరోలు వినాలా.. అంటారు. పైగా హీరోలకు ఫాలోయింగ్ ఎక్కువ. వారు ఏం చెప్పినా.. ఎవరికి చెప్పినా వింటారు.. కనుక మా అసోసియేషన్ మొదలైన కొత్తలో అధ్యక్షుడిగా హీరోలను ఉండాలనే నిర్ణయించాం.. అని మురళీ మోహన్ తెలిపారు.
కాగా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు పనిచేశారు. వెంకటేష్‌ను కూడా ఆ పదవి చేపట్టాలని కోరాం. నటీనటులం అందరం, టాలీవుడ్ మొత్తం కలసి ఆయన ఇంటికి వెళ్లి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా చేయాలని విజ్ఞప్తి చేశాం. అయితే ఆయన ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు. తాను ఇలాంటి బాధ్యతలు చేపట్టలేనని, తాను సరిగ్గా మాట్లాడలేనని, మొహమాటం ఎక్కువని.. కనుక తనను వదిలేయాలని వెంకటేష్ కోరాడు. అయితే మేం అందరం బతిమాలి ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా అయినా ఉండాలని ఒప్పించాం.. అలా వెంకటేష్ చాలా మొహమాటంతోపాటు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండేవారు.. అని మురళీ మోహన్ తెలియజేశారు. దీంతో వెంకటేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.