The Warrior Movie : యంగ్ హీరో రామ్, యంగ్ బ్యూటీ కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ.. ది వారియర్. లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోవడం లేదు. ఓ వైపు పెరిగిన సినిమా టిక్కెట్ల ధరలు, మరోవైపు వర్షాలు.. ఈ రెండింటి కారణంగా సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం లేదు. ఈ మూవీకి రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టారు. పైగా నైజాం, వైజాగ్ ఏరియాల హక్కులను భారీ మొత్తానికి రామ్ కొన్నాడు. దీంతో మూవీ హిట్ అవడం పక్కా అనుకున్నారు. కానీ ఫలితం మాత్రం రివర్స్ అయింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అది ది వారియర్ మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలోనే వీకెండ్‌లో, సోమవారం వచ్చే కలెక్షన్లపైనే ఈ మూవీ భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు. కనీసం 50 శాతం అయినా రికవరీ అయ్యే చాన్స్‌లు కనిపించడం లేదని అంటున్నారు. అయితే వారియర్ మూవీ రొటీన్ కథనే. కథ, కథనం కొత్తగా ఏమీ లేవు. గూండాలను ఎదుర్కొనే పోలీస్ కథతో అనేక సినిమాలు వచ్చాయి. కనుక రామ్ మళ్లీ ఇదే కథను ఎంచుకుని పెద్ద తప్పే చేశాడని అంటున్నారు. సినిమా ఫ్లాప్ అవడానికి ఇదే కారణమని చెబుతున్నారు.

కాగా రామ్ ఇప్పటికైనా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రూ.15 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటున్న రామ్ స్టార్ డైరెక్టర్లతో త్వరలో సినిమాలు చేయనున్నాడు. అవి హిట్ అయితే గనక స్టార్ హీరోల సరసన చేరుతాడు. కనుక ఇలాంటి సమయంలో కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడాలని, లేదంటే స్టార్ స్టేటస్‌ను కోల్పోతాడని అంటున్నారు. ఇక రామ్ త్వరలో బోయపాటి, హరీష్ శంకర్‌ల డైరెక్షన్‌లలో సినిమాలు చేయనున్నాడు.