Lemon : ప్రస్తుత తరుణంలో పెట్రోల్, డీజిల్ ధరలే కాదు.. పలు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. ముఖ్యంగా గత 10 రోజుల నుంచి నిమ్మకాయల ధరలు మరీ ఆకాశాన్నంటాయి. కేజీ నిమ్మకాయలు ఏకంగా రూ.300కు పైగానే పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు నిమ్మకాయలను కొనాలంటేనే భయపడిపోతున్నారు. అయితే నిమ్మకాయల ధరలు ఎక్కువగా ఉండడంతో కొందరు వాటిని చోరీ కూడా చేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఉన్న బజారియా అనే ప్రాంతంలోని బహదూర్ గంజ్ మొహల్లా అనే ఏరియాలో మనోజ్ కశ్యప్ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతను ఓ రోజు రాత్రి తన గోడౌన్‌కు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు వచ్చి చూసే సరికి గోడౌన్ తాళం పగలగొట్టబడి ఉంది. అలాగే లోపల అన్ని కూరగాయలు చిందర వందరగా పడి ఉన్నాయి. తీరా చూస్తే కొన్నింటిని చోరీ చేసినట్లు అర్థమైంది.
మొత్తం 60 కేజీల నిమ్మకాయలు, 40 కిలోల ఉల్లిపాయలు, 38 కిలోల వెల్లుల్లి చోరీకి గురయ్యాయని మనోజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలా నిమ్మకాయల ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిని చోరీ చేయడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.