సాధారణంగా ఒక వ్యాపారం చేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జాగ్రత్తగా ఒకరు దగ్గరుండి వ్యాపారాన్ని చూసుకుంటారు. కానీ ఇక్కడ ఒక రైతు మాత్రం నమ్మకం, నిజాయితీని తన పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. తను చేసేది కూరగాయలు వ్యాపారమే అయినా అక్కడ యజమాని ఉండడు, డబ్బులు తీసుకోడు కానీ వ్యాపారం మాత్రం చేస్తాడు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే…
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ రైతు మల్లారెడ్డి అనే రైతు కూరగాయలు, పండ్లతోట పెంపకం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కూరగాయల ధరలు పడిపోవడంతో ఎంతో నష్టం ఎదుర్కొంటున్న రైతుకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. దీంతో ఆ రైతు తోట సమీపంలోనే జగిత్యాల-గొల్లపల్లి రహదారిపై “నిజాయితీ” అనే పేరుతో కూరగాయల దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. ఈ దుకాణంలో తన తోటలో పండే కూరగాయలను అక్కడ ఉంచి వాటి ధరలను బోర్డుపై రాసి, డబ్బులు వేయడానికి ఒక డబ్బా అక్కడ ఉంచి తోట పనికి వెళ్తాడు.
ఈ విధంగా ఆ రహదారిపై వెళ్లే వారు వారికి కావలసిన కూరగాయలను సొంతంగా తీసుకొని వాటి ధరలను అక్కడ ఉన్న డబ్బాలో వేస్తారు. ఇక ప్రస్తుత కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండటం వల్ల ఫోన్ పే, గూగుల్ పే వంటి సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచాడు. అయితే అక్కడ ఎవరూ కూడా ఎలాంటి మోసం చెయ్యరని రైతు తెలిపాడు. ఈ క్రమంలోనే అక్కడ ఎవరు ఉండకపోవడానికి కారణం ఏంటని అడగగా.. అక్కడ ఒక వ్యక్తి కూర్చుంటే రోజుకు ఒక మనిషికి కూలి వృధా అవుతుంది కనుక అక్కడ ఈ విధమైన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ విధంగా ప్రతి రోజు రైతు 200 నుంచి 500 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నట్లు తెలిపాడు.