తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ ఆరోపణలు వచ్చాయి. తమ జమున హ్యాచరీస్ కోసం పేదలకు చెందిన భూములను ఆయన కబ్జా చేశారని వార్తలు వస్తున్నాయి. పలు ప్రధాన మీడియా చానళ్లు ఈ వార్తను ప్రసారం చేస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని భూ ఆక్రమణలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో సుమారుగా 100 ఎకరాలు కబ్జా అయ్యాయని మీడియా చానళ్లు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈటల భార్య జమున, కొడుకు నితిన్‌ల పేరిట అసైన్డ్ భూములను రిజిస్టర్ చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై స్పందించిన సీఎం కేసీఆర్ భూకబ్జాల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎస్ సోమేష్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ద్వారా పూర్తి నివేదిక తెప్పించాలని, నిజానిజాలను నిగ్గు తేల్చాలని అన్నారు. గత కొంత కాలంగా ఈటల ప్రభుత్వానికి, తెరాస పార్టీకి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఓ దశలో మంత్రి కేటీఆర్ ఈటలను సీఎం కేసీఆర్‌తో మాట్లాడించేందుకు యత్నించారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, తాజాగా ఈ వార్తలు ప్రసారం అవుతుండడం సంచలనం సృష్టిస్తోంది. ఈటలను పొమ్మనలేకే పొగబెట్టేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల మంత్రి పదవికి రాజీనామా చేస్తారా, లేదా, ప్రెస్ మీట్ పెడితే ఏం చెబుతారు ? అనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది.