దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ మహమ్మారి గురించి ఎంతో మంది సెలబ్రిటీలు సైతం ప్రజలలో అవగాహన చేపట్టారు. ఈ మహమ్మారి పట్ల అందరికీ అవగాహన కల్పించడం కోసం గత ఏడాది మార్చి నెలనుంచి తన బైక్ పై మైకులు పెట్టుకుని సుమారుగా 15 వేల కిలోమీటర్లు తిరిగి కరోనా గురించి ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కల్పించిన వ్యక్తి ప్రస్తుతం దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
గన్నేరువరం మండలం చీమలకుంట పల్లెకు చెందిన బామండ్ల రవీందర్ కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విస్తృతంగా ప్రచారం చేశాడు తన బండికి మైకు కట్టుకొని కరీంనగర్, జగిత్యాల,పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల ,సిద్ది పేట,వరంగల్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో కరోనా బారినపడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలలో అవగాహన కల్పించారు.
ఈ విధంగా ప్రజలలో అవగాహన కల్పించిన రవీందర్ కుటుంబం మొత్తం తాజాగా కరోనా బారిన పడ్డారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ కరోనా నుంచి కోలుకోగా, రవీందర్ మాత్రం ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే
చికిత్సకు అయ్యే డబ్బులు లేక పోవడంతో భార్యాపిల్లలు ఆందోళన చెందుతున్నారు . ఎవరైనా దాతలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.రవీందర్ కూతురు అక్షర ‘ మా నాన్న చికిత్స కోసం డబ్బులు సాయం చేయండని ‘ సినీనటుడు సోనుసూద్ , ఇతరులను వేడుకుంటోంది. ప్రభుత్వం కూడా తన తండ్రి చికిత్సకోసం ఆదుకోవాలని అక్షర వేడుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.