దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రళయం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కొద్దిగా జలుబు, దగ్గు అనిపించిన ప్రజలు కరోనా పరీక్షల నిమిత్తం పరీక్ష కేంద్రాల వద్దకు పరుగులు పెడుతున్నారు. పరీక్షల అనంతరం రిపోర్టులు రావడానికి కూడా ఆలస్యం కావడంతో ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే రిపోర్టులు కూడా ఒక్కో చోట ఒక్కో విధంగా వెలువడటంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తాజాగా బోధ్ మండలానికి చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమెకు ఏకంగా మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. మొదటిసారిగా సొనాల పీహెచ్‌సీలో కరోనా పరీక్ష చేయించుకున్నారు. టెస్టులో నెగెటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చినా కూడా ఆమెకు లక్షణాలు తగ్గకపోవడంతో నిర్మల ఆస్పత్రిలో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు.అక్కడ ఆమెకు పాజిటివ్ అని రావడంతో రిపోర్టు పట్ల బాధిత కుటుంబం గందరగోళానికి గురైంది.
ఒకసారి నెగటివ్ మరోసారి పాజిటివ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆ మహిళకు మూడోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో తీవ్రమైన అయోమయంలో పడ్డారు. ఈ రిపోర్టులను నమ్ముకుంటే పరిస్థితి తీవ్రతరం అవుతుందని భావించిన సదరు మహిళ హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు..