తెరాస నేత నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ స్థానానికి ఖాళీ ఏర్పడగా అక్కడ ఉప ఎన్నికను నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్‌ను కూడా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని తమ అభ్యర్థిగా ఎప్పుడో ప్రకటించింది. ఈ క్రమంలోనే తెరాస కూడా ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటించి బీఫామ్‌ను కూడా అందజేసింది. నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కు సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో బీఫామ్ అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అందరూ కష్టపడి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినట్లుగానే నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు అందరూ కష్టపడి నోముల భగత్‌ను గెలిపించుకోవాలని అన్నారు. సర్వేలన్నీ తెరాసకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే ఓడిపోయామని అన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలను పక్కన పెట్టాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
అనంతరం నోముల భగత్ మాట్లాడుతూ పార్టీలో తన తండ్రికి ఎంతో సముచిత స్థానం కల్పించారని, అలాగే తనకు ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు బీఫామ్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి బాటలో నడిచి తెరాస పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.