ఆమె నెలలునిండిన గర్భిణీ.. మరి కొద్ది రోజులలో పుట్టబోయే తన బిడ్డ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం కొన్న వస్తువులను చూపెడుతూ ఎంతో సంతోషంగా ఫోటోలు దిగింది. అయితే ఆమె సంతోషంపై కరోనా విషం చిమ్మింది. ఉన్నపళంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆ గర్భిణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కోవిడ్ ఉందేమోనన్న భయంతోనే ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారు. చివరికి అంబులెన్స్ లోనే మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కు చెందిన జోగారావు, నీలవేణి దంపతుల కుమార్తె పావని(22)కి గతేడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన తిరుమల్‌రావుతో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే పావని పురుడు కోసం హైదరాబాద్ వచ్చింది. ప్రస్తుతం 8 నెలలు గర్భిణిగా ఉన్న పావని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది.ఈక్రమంలోనే జనరల్ చెకప్ కోసం వెళ్లిన ఆమెకు ఉమ్మనీరు తక్కువగా ఉండడంతో సెలైన్ ఎక్కించుకుని ఇంటికి వెళ్లారు.
శుక్రవారం తెల్లవారుజామున ఉన్నఫలంగా పావనికి ఆయాసం రావడంతో తన తల్లి తాను చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రికి తీసుకెళ్ళింది.అయితే అక్కడ డాక్టర్లు ఆమెకు కరోనా ఉందేమోనన్న భయంతో చికిత్స అందించడానికి నిరాకరించారు. ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ తీసుకొని మరో ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా వారికి అదే పరిస్థితి ఎదురైంది. ఈ విధంగా పావనిని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లిన ఇప్పటికీ ఎవరూ చేర్చుకొని క్రమంలో ఆమె పరిస్థితి విషమించి అంబులెన్స్ లోనే మృతి చెందింది. ఉదయం నుంచి పావని తల్లి నీలవేణి తన బిడ్డను తన కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవటం కోసం పడిన కష్టమంతా వృధా కావడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరైంది.