Tanikella Bharani : నటుడిగా, రచయితగా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాళ్లలో తనికెళ్ళ భరణి కూడా ఒకరని చెప్పవచ్చు. దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలలో నటించి ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విలన్ గా, స్నేహితుడిగా, తండ్రిగా ఎన్నో పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే నటుడు తనికెళ్ల భరణి. తనికెళ్ల భరణి మిథునం అనే చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ లక్ష్మి, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నటించారు. కేవలం రెండు క్యారెక్టర్ల తోనే ఈ చిత్రాన్ని రూపొందించడం ద్వారా దర్శకుడిగా తనికెళ్ల భరణి ప్రతిభ బయటపడింది.
తనికెళ్ల భరణి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా తనికెళ్ళ భరణి తనకు ఎదురైన ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. మద్రాస్ లో ఉన్న సమయంలో గుంటూరు శాస్త్రి అనే వ్యక్తి ద్వారా నాకు ఇ.వి.వి సత్యనారాయణ పరిచయమయ్యారు. ఆయన చెవిలో పువ్వు అనే ఒక చిత్రానికి స్క్రిప్ట్ రాసుకుని వచ్చారు. ఒక పెద్ద పుస్తకం నాకు ఇచ్చి దానిపై స్క్రిప్ట్ ని తయారు చేయమన్నారు. నేను దాన్ని మార్చిరాయడం ఇ.వి.వి సత్యనారాయణకి అది నచ్చలేదు. ఎన్నో ఏళ్లుగా నేను ఆ స్క్రిప్టుని రాసుకున్నాను. మీరు కావాలంటే కథలో కొత్తగా ఏమన్నా జతచేయండి గానీ, కథను మార్చిరాయవద్దు అని ఇ.వి.వి సత్యనారాయణ అన్నారని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.

నాకు దేవరకొండ నరసింహ కుమార్ అనే స్నేహితుడు ఉండేవారు. తను నాలో ఉన్న రచయితను ఎంతగానో ప్రోత్సహించేవారు. అతని హఠాన్మరణం నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని తనికెళ్ల భరణి తెలియజేశారు. అదేవిధంగా రాళ్ళపల్లి గారి ఇంట్లో నేను, నా భార్యతో కలిసి కొత్తగా దిగాము. ఆయన ఇంట్లో నాకోసం ఒక సెపరేట్ గది కూడా ఉండేది. భీమరాజు అనే ఫైట్ మాస్టర్ గ్రౌండ్ ఫ్లోర్ ని అమ్ముతున్నారని తెలిసి నువ్వు తీసుకుంటే బాగుంటుంది అని ఆయన నాకు సూచించారు.
40 సంవత్సరాల క్రితం మూడు లక్షల రూపాయలకు ఇంటిని కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. నిదానంగా డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పడంతో 18 నెలల్లో రెండు లక్షల రూపాయలు ఆ ఇంటి ఓనర్ కి ఇచ్చాను. ఆ తర్వాత డబ్బుల విషయంలో ఒత్తిడి చేసి నన్ను ఇంటి నుంచి వెళ్లగొట్టారని తనికెళ్ల భరణి ఆయన ఎదుర్కొన్న సంఘటన గురించి వెల్లడించారు. ఈ గొడవ తరువాత నటుడు టార్జాన్ ను రిక్వెస్ట్ చేసి ఆ ఇంటి ఓనర్ ని బెదిరించి మొదట 50 వేలు తర్వాత పాతిక వేల రూపాయల చొప్పున వసూలు చేసుకోగలిగాను అని ఇంటర్వ్యూ సందర్భంగా తనికెళ్ల భరణి తాను ఎదుర్కొన్న సంఘటనలను తెలియజేశారు.