Tammareddy Bharadwaj : నా సినిమాని తొక్కేశారు.. వెనక్కి నెట్టేశారంటూ వాపోయిన నిఖిల్.. దిల్ రాజు తన సినిమాని వెనక్కి నెడుతున్నారని ఎవరిపైనైతే ఆరోపించాడో.. అదే దిల్ రాజుని పొగడటం మొదలుపెట్టాడు. అసలు నేను దిల్ రాజు పేరెత్తలేదంటూ ప్లేట్ మార్చాడు నిఖిల్. ఇక తాజాగా జరిగిన కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో దిల్ రాజు అయితే రాస్కోండి.. మూస్కోండి.. అంటూ మీడియాపై చిందులు తొక్కాడు. అయితే ఈ వివాదంపై ప్రముఖ సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి స్పందించారు. నేను దాదాపు 40 సినిమాలు చేశా.. మన సినిమా రిలీజ్ ఉన్నప్పుడు పక్క వాళ్లని అడుగుతుంటా.. ఈవారం నువ్ ఆగరాదు.. నెక్స్ట్ వీక్ రిలీజ్ చేసుకో అని అడుగుతాం.
అలాగే దిల్ రాజు కూడా అడిగి ఉండొచ్చు. నిజంగా దిల్ రాజు స్థాయికి ఫోన్ చేసి కార్తీకేయ 2 టీం వాళ్లని అడిగాడంటే.. గొప్పగా ఫీల్ అవ్వాలి. నిఖిల్ తెలివైన వాడే అయితే సరే అన్నా.. నీకోసం ఆగుతా.. నెక్స్ట్ వీక్ నుంచి నాకు థియేటర్స్ ఇవ్వు అని అడిగితే సరిపోతుంది. థియేటర్స్ కి దిల్ రాజు నుంచే ఫీడింగ్ ఉంది. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా వేసుకుంటాడు. ఎవరు థియేటర్స్ లీడ్ చేస్తున్నా ఇదే చేస్తారు.. ఇందులో రాజకీయం ఏం లేదు. ఆ సినిమా అయితే వెయ్యి వస్తుంది.. ఈ సినిమా అయితే లక్ష వస్తుంది. ఎవరి వ్యాపారం వాళ్లది..

ఎవడి దగ్గర డబ్బులు ఉంటే వాడు థియేటర్స్ తీసుకోవచ్చు. మాట్లాడితే థియేటర్స్ ఇవ్వట్లేదని అనటం కాదు.. దమ్మున్నోడు ఎవడైనా సరే.. ముందుకు వచ్చి థియేటర్స్ పెట్టొచ్చు. చిన్న సినిమాలు ఎప్పుడూ నష్టపోతూనే ఉన్నాయి. ఊరికే స్లంప్ తొక్క తోటకూర అంటున్నారు కానీ.. అప్పట్లో రూ.1,10,000 బడ్జెట్ దాటకూడదని రూల్స్ పెట్టారు.. ఆ తరువాత ఇంకోసారి ఇంకో బడ్జెట్ పెట్టారు. సినిమా స్థాయిని బట్టి బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు.. అక్కడే సమస్యలు వస్తున్నాయి.. అన్నారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ క్రమంలోనే ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.