T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 35వ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై శ్రీలంక గెలుపొందింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేక వెస్టిండీస్ వెనుకబడింది. ఎంతో శ్రమించినా విండీస్ టార్గెట్‌ను అందుకోలేకపోయింది. దీంతో విండీస్‌పై లంక జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్‌లలో చరిత్ అసలంక 68 పరుగులతో చెలరేగిపోగా, పతుమ్ నిస్సంక 51 పరుగులు, కుశాల్ పెరీరా 29, దసున్ శనక 25 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఆండ్రె రస్సెల్ 2 వికెట్లు తీశాడు. డ్వానె బ్రేవోకు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 169 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో షిమ్రాన్ హిట్‌మైర్ 81 పరుగులు చేసి రాణించగా, నికోలాస్ పూరన్ 46 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో బినురా ఫెర్నాండో, చమిక కరుణరత్నె, వనిందు హసరంగ డిసిల్వలు తలా 2 వికెట్లు తీశారు. దుష్మంత చమీరా, దసున్ శనక చెరొక వికెట్ తీశారు.