T20 World Cup 2021 : షార్జా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 19వ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలుపొందింది. న్యూజిలాండ్ ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ తడబడింది. దీంతో ప్లేయర్లు ఆచి తూచి ఆడారు. ఎట్టకేలకు లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరల్డ్ కప్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో డెరిల్ మిచెల్ (27 పరుగులు, 1 ఫోర్, 2 సిక్సర్లు), డెవాన్ కాన్‌వే (27 పరుగులు, 3 ఫోర్లు), కేన్ విలియమ్సన్ (25 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్) మినహా ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 4 వికెట్లు పడగొట్టగా షాహీన్ షా అఫ్రిది, ఇమాద్ వసీమ్, మహమ్మద్ హఫీజ్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఆరంభంలో తడబడింది. ఈ క్రమంలో ఆ జట్టు ప్లేయర్లు నిదానంగా ఆడారు. దీంతో 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్‌మెన్‌లలో మహమ్మద్ రిజ్వాన్ (33 పరుగులు, 5 ఫోర్లు), ఆసిఫ్ అలీ (27 పరుగులు, 1 ఫోర్, 3 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (26 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. కివీస్ బౌలర్లలో ఇష్ సోధి 2 వికెట్లు తీయగా, మిచెల్ శాంట్‌నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్‌లు తలా 1 వికెట్ తీశారు.