Jio : బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్‌తోపాటు యాక్ట్ ఫైబర్ కూడా టాప్ పొజిషన్‌లో ఉన్నాయి. అయితే త్వరలో ఈ కంపెనీలకు షాక్ తగలనుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలో మరో కంపెనీ మన దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలుసు కదా. ఆయనకు అనేక కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో స్టార్ లింక్ అనే శాటిలైట్ కంపెనీ ఒకటి. ఇప్పటికే ఈ కంపెనీ పలు దేశాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. అయితే వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి ఈ కంపెనీ మన దేశంలోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించనుంది. అందుకుగాను ఇప్పటికే ఈ కంపెనీ రిజిస్టర్ చేసుకుంది కూడా.
ఇక స్టార్ లింక్ కంపెనీ ప్రస్తుతం హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను పలు ఎంపిక చేసిన చోట్ల పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. రూ.7350 చెల్లించిన వారికి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇస్తారు. వారికి 50 నుంచి 150 ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ వస్తుంది. ప్రస్తుతం ఈ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.
అయితే స్టార్ లింక్ కంపెనీకి విదేశాల్లో మంచి పేరుంది. ఈ క్రమంలోనే ఈ కంపెనీ భారత్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ముందుకు రావడం ఇతర కంపెనీలకు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా జియో, ఎయిర్ టెల్ కంపెనీలు అందిస్తున్న ఇంటర్నెట్ సేవలపై ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి స్టార్ లింక్ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాలి.