Srivalli Sarees : సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందించిన చిత్రం పుష్ప. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. అంతేకాకుండా పుష్ప ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో బన్నీ పెర్ఫార్మన్స్ కు ఇండియా వైడ్ గా అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ చిత్రం విడుదలకు ముందే అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం డైలాగ్స్ ని, సాంగ్స్ ని అనుకరిస్తూ యువత చేసిన వీడియోలతో సోషల్ మీడియాలు దద్దరిల్లి పోయాయి.
పుష్ప చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశవ్యాప్తంగా పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కి అభిమానులు పెరిగిపోయారు. పుష్ప కి ఉన్న క్రేజ్ ని ప్రస్తుతం అందరూ వాడేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా పేరుతో చిప్స్ ప్యాకెట్లు కూడా వచ్చాయి. జనాలలో ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ ను వినియోగించుకొని వ్యాపారులు తమ డిమాండ్ ను పెంచుకోవడం కోసం మార్కెట్లో పుష్ప టీషర్ట్స్, షర్ట్స్ కూడా తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు.

ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. రష్మిక కూడా తన అద్భుతమైన నటనతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతోపాటు వరుస బాలీవుడ్ ఆఫర్లు కూడా దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ చిత్రంలో రష్మిక ధరించిన కాస్ట్యూమ్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. ఇదే క్రేజ్ తో వ్యాపారులు ఇప్పుడు ఏకంగా చీరలను కూడా డిజైన్ చేస్తున్నారు. పుష్ప చిత్రంలో రష్మిక రారా సామి అనే పాటలో ధరించిన గ్రీన్ బ్లౌజ్ అండ్ రెడ్ శారీతో చేసిన డ్యాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఆ శారీలను శ్రీవల్లి శారీస్ పేరిట మార్కెట్లో సేల్ చేస్తున్నారు వ్యాపారులు. ప్రస్తుతం పండుగ సమయం కావడంతో మహిళలు కూడా శ్రీవల్లి శారీస్ ను కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాజస్థాన్ లో ఈ శారీస్ ఇప్పటికే దుకాణాల్లో సేల్స్ కి వచ్చేశాయి. సోషల్ మీడియాలో కూడా శ్రీవల్లి శారీస్ కు సంబంధించిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
మొదటి పార్ట్ పుష్ప ది రైస్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో.. రెండో పార్ట్ పుష్ప ది రూల్ ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక పుష్ప 2 లో మరిన్ని క్యారెక్టర్లు కూడా యాడ్ చేయనున్నట్టు తెలిపారు మూవీ మేకర్స్. ఇటీవల గ్రాండ్ గా పుష్ప పార్ట్ 2 పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ నెలలోనే పుష్ప ది రూల్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.