Srikanth : టాలీవుడ్‌లో గత కొంత కాలంగా పెద్దరికం గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే మోహన్‌బాబు వర్గీయులు ఎప్పుడూ తామే పెద్ద అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై నటుడు శ్రీకాంత్ తాజాగా స్పందించారు. టాలీవుడ్‌కు పెద్ద ముమ్మాటికీ చిరంజీవే అని.. ఆయనను మించి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఈ మేరకు శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

టాలీవుడ్‌లో గత కొంత కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చిరంజీవి ఎంతో కృషి చేస్తున్నారని.. ఆయనకు పెద్దగా ఉండడం ఇష్టం లేదని.. కానీ సినిమా వాళ్ల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని గతంలోనే చెప్పారని.. ఇప్పుడు అదే చేస్తున్నారని.. కనుక ఆయన ఒప్పుకోకపోయినా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే అని శ్రీకాంత్ అన్నారు.
కాగా చిరంజీవి ఇటీవలి కాలంలో సినిమా రంగ సమస్యలపై అనేక సార్లు ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం అయ్యారు. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో సీఎం జగన్‌ను ఇతర హీరోలతో కలిసి సమావేశం అయ్యారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు అయింది. అయితే సవరించిన ధరల ప్రకారం కొత్త జీవోను విడుదల చేయడంలో కొంత ఆలస్యం అవుతోంది. ఆ జీవో వస్తే.. ఎట్టకేలకు ఏపీలోనూ సినిమా టిక్కెట్ల ధరలు పెరుగుతాయని అంటున్నారు.