Sridevi : టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చిరు హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగాడు. ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను తనదైన నటన, డాన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలనటిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా రాణించింది. శ్రీదేవి తెలుగు, తమిళ వంటి సినిమాల్లోనే కాదు హిందీలో కూడా వందల సినిమాల్లో నటించి మెప్పించింది.
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ అంటే అప్పట్లో ఓ క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో అనేక సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇద్దరూ కలిసి జోష్ తో స్టెప్పులు వేస్తే ఫ్యాన్స్ కు పండగే. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన కొన్ని సినిమాలు ఆగిపోయాయి. ఆ సినిమాలు కనక వచ్చి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయడుతుంటారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఓ బ్యూటిఫుల్ ప్రేమకథా చిత్రం కూడా మిస్ అయ్యింది. ఆ సినిమా ఏంటి.. ఎందుకు మిస్ అయ్యింది అనే వివరాలోకి వెళ్తే.. అప్పట్లో అశోక్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్యూటిఫుల్ ప్రేమకథా చిత్రం అభినందన. ఈ సినిమాకు జి.బాబు కథను అందించారు.

ఆత్రేయ అందించిన పాటలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. మంచుకురిసే వేళలో అనే పాట శ్రోతల మనసు దోచుకుంది. ఇప్పటికీ ఆ పాటకు అభిమానులు ఉన్నారు. ఇక ఈ సినిమాకు కథ రాయడంతో పాటు జి.బాబునే నిర్మించారు. అయితే కథ పూర్తయిన తరవాత ఆయన మొదట చిరంజీవి, శ్రీదేవిలతో ఈ సినిమాను చేయాలని అనుకున్నారట. సినిమా కథను శ్రీదేవికి వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తరువాత చిరంజీవి మేనేజర్ కు కథ చెప్పగా ఆయన ఇది ఓల్డ్ లవ్ స్టోరీ అంటూ రిజెక్ట్ చేశాడట. దీంతో ఇదే కథతో అన్వేషణ సినిమా హీరో కార్తీక్ మరియు శోభనను హీరో హీరోయిన్లుగా తెరకెక్కించారు. అలా తెరక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతోపాటు క్లాసిక్ మూవీగా నిలిచింది.