Sravana Bhargavi : అన్నమాచార్య కీర్తనను భక్తిభావంతో ఆలపించకుండా.. తన అందాన్ని వర్ణించడం కోసం పాడిందని ఆరోపిస్తూ.. సింగర్ శ్రావణ భార్గవిపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం విదితమే. అయితే ఈ వివాదంలో ఆమె చిక్కుకున్నప్పటికీ మరింత ఆగ్రహం తెప్పించేలా వ్యాఖ్యలు చేసింది. తాను ఆ ఉద్దేశంతో ఆ పాటను పాడలేదని.. తప్పుగా చూస్తే అంతా తప్పుగానే కనిపిస్తుందని.. ఏమైనా చేసుకోండి.. ఆ పాటను తీసే ప్రసక్తే లేదని తెలియజేసింది. అయితే అలా అన్న తరువాత ఆమెకు ఇంకా సెగ తగిలింది. సాక్షాత్తూ టీటీడీతోపాటు అన్నమాచార్య కుటుంబ సభ్యులు, తిరుపతి వాసులు ఆమెపై ధ్వజమెత్తారు. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇక తిరుపతిలో కొందరు అయితే శ్రావణ భార్గవిపై కేసు కూడా పెట్టారు. దీంతో వివాదం ఇంకా ముదిరితే తనకే మంచిది కాదనుకుందో.. మరొక విషయమో.. తెలియదు కానీ.. శ్రావణ భార్గవి తన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించింది. సోషల్ మీడియాలో తన పట్ల వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఒకపరి అనే పాటను ఆధ్యాత్మికతతో కాకుండా శృంగార పరంగా పాడిందని చాలా మంది ఆమెను తిట్టిపోశారు. దీంతోనే ఆమె పాటను డిలీట్ చేసింది. ఈ మేరకు ఆమె ఈ విషయాన్ని ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేసింది.

తన వీడియోపై కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని, అలాగే అన్నమాచార్య కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని.. కనుక తాను వీడియోను డిలీట్ చేస్తున్నానని తెలియజేసింది. ఇక శ్రావణ భార్గవిపై ఇప్పటికే యాంకర్ శ్వేత, నటి కరాటే కల్యాణి స్పందించారు. ఆమె ఒక వివాహిత కాదని, కనీసం అలా కూడా ప్రవర్తించడం లేదని మండిపడ్డారు. ఆమె మెడలో తాళి, కాళ్లకు మెట్టెలు లేవని.. అవన్నీ లేకుండానే అంత సంప్రదాయ బద్ధమైన పాటను ఎలా పాడిందని అంటున్నారు. అయితే శ్రావణ భార్గవి ఎట్టకేలకు ఆ వీడియోను డిలీట్ చేసింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లే అని తెలుస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.