Software Blues : నటుడు విశ్వక్ సేన్, దేవీ నాగవల్లిల మధ్య మాటల యుద్ధం ఎంతటి వివాదానికి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వక్ సేన్ తాను నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ వీడియో చేస్తే అది రసాభాస అయింది. తరువాత దేవి, విశ్వక్ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని నష్ట పరిహారం దావా వేసే వరకు వెళ్లారు. తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఈ వివాదం మాత్రం సద్దు మణిగింది. అయితే విశ్వక్ సేన్ లాగే ఓ యువ హీరో కూడా తన సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ వీడియో చేద్దామని అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగింది. రచ్చ రచ్చ అయింది. చివరకు చొక్కాలు చింపుకుని తన్నుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
యువ హీరో శ్రీరామ్ నిమ్మల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం.. సాఫ్ట్‌వేర్ బ్లూస్. ఇందులో ఆయనకు జోడీగా భావన హీరోయిన్‌గా నటించింది. ఉమా శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చెందిన ట్రైలర్‌ను తాజాగా లాంచ్ చేయగా.. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్‌కు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ జూన్ 24వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ కోసం హీరో, హీరోయిన్ కలసి ప్రాంక్ వీడియో చేద్దామని ప్లాన్ చేశారు.

ప్రాంక్ వీడియోలో భాగంగా ఒక చోట చర్చిస్తుండగా.. ఒక వ్యక్తి వచ్చి అలాంటి వీడియోలను తమ కాలనీలో చేయొద్దని కోరాడు. అయితే వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరకు అది గొడవకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాలు గొడవపడ్డాయి. చొక్కాలు చింపుకుని మరీ తన్నుకున్నారు. చివరకు చుట్టూ ఉన్న వారు సర్ది చెప్పారు. దీంతో ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ప్రమోషన్స్ కోసం ప్రాంక్ వీడియో చేద్దామని అనుకున్నారు. కానీ అదే సంఘటన వైరల్‌గా మారింది. మరి ఈ ప్రాంక్ వీడియో ఘటన సినిమాకు ప్లస్ అవుతుందా.. కలసి వస్తుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.