Sirivennela : ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం అందుతోంది. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని కిమ్స్ హస్పిటల్‌లో చేర్పించినట్లు తెలిసింది. 2 రోజుల కిందట ఆయన అస్వస్థతకు గురి కావడంతో కిమ్స్‌కు చెందిన ప్రముఖ డాక్టర్లు ఆయనకు వైద్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇదే విషయంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. న్యుమోనియాతోనే ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని.. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో లేరని చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
కాగా విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన డా.సి.వి.యోగి, సుబ్బలక్ష్మి లకు చేంబోలు సీతారామశాస్త్రి జన్మించారు. పదోతరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న ఆయన.. ఇంటర్ కోసం కాకినాడ వెళ్లారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. తెలుగు భాషపై మంచి గ్రిప్ ఉండడంతో.. ఎంఏ చదువుతుండగానే ఆయనకు అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు. తరువాత ఆయన సిరివెన్నెల పేరిట సిరివెన్నెల సీతారామశాస్త్రిగా పేరుగాంచారు.
ఇప్పటి వరకు ఆయన 3వేలకు పైగా పాటలు రాశారు. 10 నంది అవార్డులు ఆయనను వరించాయి. 3 ఫిలిం ఫేర్ అవార్డులు పొందారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని పాటలు ఎవర్ గ్రీన్ గా పేరుగాంచాయి. ముఖ్యంగా గాయం సినిమాలో ఆయన రాసిన నిగ్గదీసి అడుగు పాటతోపాటు క్రిమినల్ సినిమాలో తెలుసా, మనసా.. అలాగే మహర్షిలో సాహసం నా పథం.. ఇలా అనేక వందల సంఖ్యలో సిరివెన్నెల పాటలు ఎంతగానో పేరుగాంచాయి.
కాగా చివరి సారిగా ఆయన కొండపొలం మూవీలో తలఎత్తు అనే సాంగ్ ని షేర్ చేశారు. అందులో లిరిక్స్ ను అభిమానులతో పంచుకున్నారు.