Siddharth : నటుడు సిద్ధార్థ ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు. మొన్నా మధ్య సమంత విడాకుల ప్రకటన అనంతరం సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇక తాజాగా బ్యాడ్మింటన్ చాంపియన్ సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర ట్వీట్ సంచలనంగా మారింది. అయితే ఎట్టకేలకు సిద్ధార్థ్ ఆమెకు క్షమాపణలు చెబుతూ.. ఈ వివాదానికి ఇక చెక్ పెట్టేశాడు.
సైనా నెహ్వాల్ ఇటీవల చేసిన ఓ ట్వీట్‌ను ఉద్దేశించి నటుడు సిద్ధార్థ్ అభ్యంతరకర పదాలను వాడుతూ ట్వీట్ చేశాడు. దీంతో అతనిపై నెటిజన్లే కాకుండా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే తాను కేవలం జోక్ చేశానని, దాన్ని డబుల్ మీనింగ్‌లో తీసుకుంటే తప్పు తనది కాదని అన్నాడు. కానీ అతనిపై వస్తున్న విమర్శలు ఏమాత్రం తగ్గలేదు. ఓ వైపు జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఈ వివాదాన్ని ఇంకా చిలికి చిలికి గాలి వాన చేయడం ఇష్టం లేక సిద్ధార్థ్ ఎట్టకేలకు క్షమాపణలు చెబుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు సిద్ధార్థ్ ట్విట్టర్‌లో ఓ లేఖను విడుదల చేశాడు. అందులో సైనా నెహ్వాల్‌ను క్షమాపణలు కోరుతున్నానని అన్నాడు.
డియర్ సైనా.. నేను మీపై వేసిన అసభ్యకర జోక్‌కు మీకు నేను క్షమాపణలు చెబుతున్నా. మీరు చేసిన ట్వీట్ ను ఉద్దేశించి నేను నా అభిప్రాయాన్ని జోక్ రూపంలో చెప్పా. మీకు, నాకు అనేక విషయాల్లో భేదాభిప్రాయలు ఉండొచ్చు. కానీ మీ పట్ల నేను అలా ట్వీట్ చేసి ఉండకూడదు, అది సహేతుకం కాదని భావిస్తున్నా. అది జోక్.. చాలా మంచి జోక్. అంతకన్నా మించి నేనేమీ వివరణ ఇచ్చుకోలేను. కానీ ఆ జోక్ వేసినందుకు క్షమాపణలు చెబుతున్నా. మీరు ఎల్లప్పుడూ బ్యాడ్మింటన్‌లో నా చాంపియనే.. అని సిద్ధార్థ్ ముగించాడు.
కాగా సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెప్పడంతో సిద్ధార్థ్ ఎట్టకేలకు ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.