Shweta Tiwari : నటి శ్వేతా తివారీ ఈ మధ్య కాలంలో బాగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె దేవుడి పట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దేవుడు తన బ్రా సైజ్ కొలతలను తీసుకుంటున్నాడని ఆమె వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన షో స్టాపర్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఆ విధంగా వ్యాఖ్యలు చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు భగ్గుమన్నారు. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. అయినప్పటికీ తాను క్షమాపణలు చెబుతున్నానని తరువాత శ్వేతా తివారీ ప్రకటించింది. అయినా.. ఆమెకు చిక్కులు తప్పడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన జితేంద్ర సమాధియా అనే ఓ లాయర్ శ్వేతా తివారీకి లీగల్ నోటీసులు పంపించారు. శ్వేతా కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని.. హిందువులను కించపరిచే విధంగా ఆమె ఆ వ్యాఖ్యలు చేసిందని.. వెంటనే సారీ చెప్పకపోతే ఆ వెబ్ సిరీస్ నటీనటులు అందరికీ లీగల్ నోటీసులను పంపిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇక ఆమెపై భోపాల్‌లో ఇప్పటికే ఓ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే ఆమె ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు సహ నటులు సౌరభ్ రాజ్ జైన్, దిగంగన సూర్యవంశీ, కంగల్‌జిత్ సింగ్, రోహిత్ రాయ్‌లు కూడా పక్కనే ఉన్నారు. కానీ వారు ఆమె కామెంట్లపై స్పందించలేదు. దీంతో ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై నటి శ్వేతా తివారీ ఎలా స్పందిస్తుందో చూడాలి.