Shiva Reddy : మిమిక్రీ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. శివారెడ్డి. ఈయన సినిమాల్లోకి రాకముందు ఎన్నో మిమిక్రీ ప్రదర్శనలు చేశారు. ఇప్పటికీ తన కార్యక్రమాలను ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు, నటీనటులను ఆయన అలవోకగా మిమిక్రీ చేసి చూపించగలరు. ఇప్పటికే ఆయన పలు సినిమాల్లోనూ మిమిక్రీ చేసి అలరించారు. అయితే తాజాగా మరోమారు శివారెడ్డి చేసిన మిమిక్రీ ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.
డాక్టర్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో ఆయన భార్య జీవిత దర్శకత్వంలో మే 20వ తేదీన విడుదలవుతున్న చిత్రం.. శేఖర్. ఇందులో రాజశేఖర్ భిన్నమైన పాత్రలో నటించారు. ఈ మూవీలో ఆయన కుమార్తెలు కూడా నటించడం విశేషం. ఇక దీనికి ఆయన కుమార్తెలు శివాని, శివాత్మికలు.. రీరికార్డింగ్ నుంచి స్క్రిప్ట్ వరకు అన్ని పనులను చూసుకోవడం ఇంకో విశేషం. ఈ క్రమంలోనే ఈ మూవీకి చెందిన ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా నిర్వహించారు. ఇందులో భాగంగా కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి మరోమారు మిమిక్రీ చేసి అలరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మిమిక్రీ చేసిన శివారెడ్డి ముందుగా చంద్రబాబును అనుకరించారు. తరువాత కేసీఆర్, కేఏపాల్ లాగా మాట్లాడి ఆకట్టుకున్నారు. ఆ తరువాత చిరంజీవి, బాలకృష్ణల మిమిక్రీ చేశారు. ఈ క్రమంలోనే చాలా రోజుల తరువాత శివారెడ్డి మిమిక్రీ చేయడంతో ఆయన ప్రదర్శనను చూసేందుకు నెటిజన్లు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. కాగా ఆయన లేటెస్ట్ మిమిక్రీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.