Shekar Movie : యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా పేరుగాంచిన రాజశేఖర్ చాలా రోజుల తరువాత నటించిన చిత్రం.. శేఖర్. ఈ మూవీకి స్వయంగా ఆయన భార్య జీవిత దర్శకత్వం వహించారు. అలాగే స్క్రిప్ట్, రీ-రికార్డింగ్ వంటి పనులను వారి కుమార్తెలు శివాని, శివాత్మికలు పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నెల 20వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ మూవీకి బ్రేక్ పడింది. కోర్టు ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే అసలు ఇందుకు కారణాలు ఏమిటి ? అన్న విషయానికి వస్తే..
ఫైనాన్షియర్ పరంధామరెడ్డి గతంలో హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. జీవిత రాజశేఖర్ తమకు డబ్బులు ఇవ్వాలని.. ఎంత అడిగినా ఇవ్వడం లేదని చెప్పి ఆయన కోర్టులో కేసు వేశారు. దీంతో కోర్టు డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాటిలైట్, థియేటర్, ఓటీటీ.. చివరకు యూట్యూబ్‌లో కూడా శేఖర్ మూవీని ప్రదర్శించకూడదని కోర్టు చెప్పింది. దీంతో జీవిత రాజశేఖర్‌లకు గట్టి దెబ్బ తగిలింది.

అయితే ఈ విషయంపై రాజశేఖర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. శేఖర్ సినిమా కోసం ఉన్నదంతా అమ్మి పెట్టామని.. అదే తమ సర్వస్వమని అన్నారు. ఈ సినిమాను నిర్మించేందుకు చాలా కష్టపడ్డామన్నారు. దీనికి విశేష రీతిలో ఆదరణ లభిస్తుందన్నారు. ఎవరో తమపై కక్ష గట్టి కావాలనే సినిమా ప్రదర్శను నిలిపివేయిస్తున్నారని.. అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సినిమా ప్రదర్శన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక కోర్టు ఆదేశాలతో ఇప్పటికే థియేటర్లలో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.